అల్లు అర్జున్ (Allu Arjun) , త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుందనేది అధికారికంగా స్పష్టమైంది. ‘పుష్ప 2’తో (Pushpa 2: The Rule) నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న బన్నీ, తన తర్వాతి సినిమాను పాన్ వరల్డ్ రేంజ్‌లో చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ ప్రాజెక్ట్‌ని గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. తాజాగా, నిర్మాత సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. “స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తయ్యింది.
త్రివిక్రమ్, బన్నీ త్వరలోనే చివరిసారిగా కథపై చర్చలు జరిపి సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతారు” అని అన్నారు. ఈ సినిమా సాధారణ కథ కాకుండా, ప్రత్యేకమైన పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందించబడుతోంది. పాన్ ఇండియా ప్రేక్షకుల కోసం త్రివిక్రమ్ ఈ కథను ప్రత్యేకంగా రూపొందిస్తున్నట్లు టాక్. సినిమా బడ్జెట్ దాదాపుగా 600 కోట్లుగా ఉంటుందని సమాచారం. సినిమాలో భారీ సెట్స్, విస్తృతమైన వీఎఫ్ఎక్స్ పనులు కీలకంగా ఉంటాయి.
“వీఎఫ్ఎక్స్ షాట్ల కోసం ప్రత్యేక లొకేషన్ ఎంపిక చేయబోతున్నాం. సెట్స్ అన్నీ అక్కడే నిర్మించబోతున్నాం” అని వంశీ తెలిపారు. “సినిమా ప్రారంభానికి ముందు బన్నీ పూర్తిగా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాడు. క్యారెక్టర్ కోసం కొత్తగా శిక్షణ తీసుకోవడం, మరింత పట్టు సాధించడం కోసం కొంత సమయం తీసుకుంటాడు” అని వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ 2025 సమ్మర్ అనంతరం మొదలయ్యే అవకాశం ఉంది.
2026 చివర్లో సినిమాను విడుదల చేయాలని టీం లక్ష్యం పెట్టుకుంది. ఈ గ్యాప్‌లో త్రివిక్రమ్ ఇతర నటీనటులను ఖరారు చేయనున్నారు. మ్యూజిక్ కోసం త్రివిక్రమ్ తమన్ (S.S.Thaman) లేదా అనిరుద్‌ని (Anirudh Ravichander) సంప్రదించే అవకాశాలు ఉన్నాయి. బన్నీకి ఇది కెరీర్‌లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా మారనుంది. ‘అల వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramuloo) తరవాత ఈ కాంబినేషన్‌పై ప్రేక్షకులు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. అందుకే ఈ సినిమా పట్ల భారీ అంచనాలు నెలకొన్నాయి.