విదేశీ సినిమాలపై వంద శాతం టారిఫ్‌లు విధిస్తూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ప్రకటన చేశారు. త్వరలో దీనిపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొస్తామని కూడా చెప్పారు. ఈ క్రమంలో ఈ నిర్ణయం ఇండియన్ సినిమాకు ముఖ్యంగా తెలుగు సినిమా చేటు అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మన సినిమా వసూళ్లలో ఓవర్సీస్ కలెక్షన్స్‌కి సింహ భాగం ఉండటమే దీనికి కారణం అనే వాదన ఉండటమే. అయితే ఇదేమంత పెద్ద విషయం కాదని.. అంత ఆందోళన చెందక్కర్లేదు అని ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ అన్నారు. ఈ మేరకు ఆయన ఓ దినపత్రికతో మాట్లాడారు.
సినిమాలపై ట్రంప్ టారిఫ్ ఎలా వేస్తారనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. అప్పుడే మన పరిస్థితి క్లారిటీగా తెలుస్తుంది. మన వస్తువుల్ని అమెరికాకు ఎగుమతి చేసినప్పుడు సరిహద్దు కేంద్రాల దగ్గర లెక్కగట్టి టారిఫ్‌లు విధిస్తారు. సినిమాకు ఇలాంటి హద్దులు లాంటివి లేవు. అంతా ఆన్‌లైన్‌లోనే సాగుతోంది. ఇలాంటప్పుడు ఎలా పన్నులు విధిస్తారనేది తేలాలి. ఒకవేళ సినిమా పంపిణీ హక్కులు కొనుగోలుకు చేసిన ఖర్చుపై పన్ను విధించాలనుకుంటే ఆ ఖర్చును ఎలా నిర్ధారిస్తారు అనేది కూడా ప్రశ్నే అని విశ్వప్రసాద్ విశ్లేషించారు.
అలాగే సినిమా ఎంత వసూలు చేసిందనే విషయంపై సుంకాలు విధించడం కూడా అమెరికాలో కుదరదని.. అలా వసూలు చేయమని ఆదేశాలు ఇచ్చే హక్కు అమెరికా ప్రెసిడెంట్‌కి లేదని నిర్మాత తెలిపారు. ఆ లెక్కన సినిమాలపై ట్రంప్ టారిఫ్‌ల భయం అక్కర్లేదు అని చెప్పారు. ఒకవేళ చట్టంగా తీసుకొచ్చినా అది అమల్లోకి రావడానికి చాలా నెలలు పడుతుందని.. అక్కడి విధానాలు అలా ఉన్నాయని ఆయన చెప్పారు. అలాగే కేవలం మన సినిమాల గురించి ట్రంప్ ఇలా చేస్తున్నారని చెప్పలేమని.. జపనీస్, చైనీస్ సినిమాలు కూడా అక్కడ బాగా ఆడుతున్నాయని విశ్వప్రసాద్ ప్రస్తావించారు.