“మా నాన్నగారు నన్ను హీరోగా పెట్టి సినిమా తీయడమే ఎక్కువ అనిపిస్తున్నప్పటికీ.. ఆయన నాకు రెమ్యూనరేషన్ కూడా ఇస్తే తీసుకోవాలనుంది, ఇప్పటివరకూ ఏమీ ఇవ్వలేదు” అని పూరీ ఆకాష్ సరదాగా చెబుతుండగా.. మధ్యలోనే పూరీ జగన్నాధ్ అడ్డుకొని “సినిమా రిలీజ్ అయ్యాక బాగా డబ్బులొస్తే.. వాడు ఎక్స్ పెక్ట్ చేయనిదానికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తాను” అనడం, అనంతరం తండ్రీకొడుకులిద్దరూ కావలించుకోవడం పాత్రికేయుల మనసూయలకు హత్తుకుంది. మొన్న ఒక ప్రముఖ తెలుగు పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తాజా చిత్రం “మెహబూబా” విశేషాలను చెబుతూ పూరీ జగన్నాధ్, పూరీ ఆకాష్ లు ఈ విధంగా మాట్లాడడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇప్పుడంటే పూరీ జగన్నాధ్ ఒక హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు కానీ.. నిజానికి ఒక అయిదారేళ్ళ క్రితం వరకూ పూరీ జగన్నాధ్ సినిమాలో హీరోగా నటించడం కోసం ప్రతి స్టార్, సీనియర్, యంగ్ హీరో పరితపించేవారు. అందుకు కారణం ఎలాంటి సబ్జెక్ట్ లో అయినా మాస్ ఎలిమెంట్స్ ను పుష్కలంగా జొప్పించి సదరు సినిమాలను మాస్ ఆడియన్స్ మొదలుకొని క్లాస్ ఆడియన్స్ వరకూ అందర్నీ ఆకట్టుకొనే విధంగా తెరకెక్కించగల అద్భుతమైన ఆలోచనా శక్తి పూరీ జగన్నాధ్ కు ఉండడమే. అలాగే.. నిర్మాతకు భారీ నష్టాలు రాకుండా వీలైనంత త్వరగా సినిమాల్ని తీసేయడం కూడా పూరీ జగన్నాధ్ లో మెచ్చుకోదగ్గ విషయం. మరి ఇంతటి విష్టమైన చరిత్ర ఉన్న పూరీ జగన్నాధ్ “మెహబూబా”తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చి తాను దర్శకుడిగా నిలదొక్కుకోవడమే కాక తన కుమారుడ్ని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం ఏ స్థాయిలో చేస్తాడో అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.