వరుసగా రెండు డిజాస్టర్లు ఇచ్చిన తర్వాత పూరి జగన్నాథ్ ఇప్పుడు కొత్త సినిమాను షురూ చేశారు. విజయ్ సేతుపతి హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల జరిగిన షెడ్యూల్ చక్కగా వచ్చిందని.. త్వరలో కొత్త షెడ్యూల్ ఉంటుందని సమాచారం. అయితే ఈ ఇన్ఫోతోపాటు మరో సమాచారం కూడా బయటకు వచ్చింది. అదే పూరి జగన్నాథ్ నెక్స్ట్ ప్లాన్స్. అవును ఆయన చేతిలో ఇప్పుడు రెండు కథలు సిద్ధమవుతున్నాయట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే ఆ రెండింటి అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది అని సమాచారం.
‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో తిరిగి ట్రాక్ హిట్ ఎక్కినట్లే కనిపించిన పూరి జగన్నాథ్.. ఆ తరవాత ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ అంటూ ఇబ్బందికర సినిమాలు చేసి ఇబ్బందిపడ్డారు.. ఇబ్బందిపెట్టారు. దీంతో ఈసారి కమ్ బ్యాక్ గట్టిగా ఇవ్వాలని పూరి డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. ఈ క్రమంలో రెండు కొత్త ఆలోచనలు చేశారట. మేకింగ్ స్టైల్, పద్ధతులు మార్చుకుని, పాత పూరిని మళ్లీ బయటకు తీసుకొచ్చేలా ఆ రెండు సినిమాలు ఉంటాయి అని అంటున్నారు.
పూరి తన తర్వాతి సినిమాను కూడా తమిళ స్టార్ హీరోతోనే చేస్తారని తెలుస్తోంది. ఈ మేరకు శివ కార్తికేయన్, సూర్యతో చర్చలు జరిగాయి అని కూడా అంటున్నారు. అలాగే తెలుగులో ఓ యంగ్ స్టార్ హీరోకి వినిపించారట. త్వరలోనే ఈ సినిమాలకు సంబంధించి అధికారిక ప్రకటన ఉంటుంది అని చెబుతున్నారు. తెలుగు స్ట్రయిట్ సినిమా ప్రేమకథగా ఉంటుందని, తమిళ స్టార్ హీరోతో చేయబోయే సినిమా యాక్షన్ బేస్డ్‌గా ఉంటుందని చెబుతున్నారు.
ఇక విజయ్ సేతుపతి సినిమా సంగతి చూస్తే.. ‘బెగ్గర్’, ‘భవతీ భిక్షాందేహీ’ అనే టైటిళ్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇందులో సంయక్త, టబు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్‌లో రూపొందుతున్న ఈ సినిమాను ఈ ఏడాదిలోనే తీసుకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని టాక్. ఎందుకంటే సినిమాల టేకింగ్, మేకింగ్‌లో ఆయన స్పీడ్ అలా ఉంటుంది మరి.