డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ హీరో రామ్ తో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. జూలై 18న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలో హీరో మొత్తం తెలంగాణా స్లాంగ్ లో మాట్లాడుతుంటాడు. ఇక చాలా వరకూ పాత్రలన్నీ తెలంగాణా యాసతోనే మాట్లాతున్నట్టు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతుంది.
ఈ విషయం పై తాజాగా జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు పూరి జగన్నాథ్ చేసిన కామెంట్స్ పెద్ద ధుమారాన్నే రేపాయి. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. ‘సినిమాను చూసిన వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ ఈ సినిమాలో తెలంగాణా యాస ఎక్కువైందన్నాడు. ‘మార్ ముంత.. చోడ్ చింత’ అనే డైలాగ్ ఎవరికీ అర్ధం కావడం లేదని.. వైజాగ్ ఏరియాలో డబ్బులు రావేమో అంటూ చెప్పుకొచ్చాడు” అని పూరి తెలియజేసాడు.
అయితే ‘తెలంగాణా భాష అర్ధం కాకపోవడం ఏంటని…? నేను ప్రశ్నించాను. మరి ఇన్ని రోజులు తెలంగాణాలో ఆంధ్రా సినిమాలు చూడడం లేదా..? వైజాగ్ లో ఎనభై శాతం మందికి హిందీ రాకపోయినా.. హిందీ సినిమాలు చూస్తుంటారు.. నలభై ఏళ్ళ క్రితం వైజాగ్ లో అర్ధం కాకపోయినా.. చైనీస్ సినిమా చూశాను.. సినిమా బావుంటే జనాలు చూస్తారు.. ఆ బయ్యర్ కు నేను రేటు తక్కువ చెప్పాలని అలా చెప్పాడని నాకు తెలుసు.’ అంటూ కామెంట్ చేసాడు. అసలు పూరి ఇలా ఎందుకు కామెంట్ చేసాడు.. తెలంగాణ ప్రజల్ని ఆకర్షించడానికా… లేక ఆ డిస్ట్రిబ్యూటర్ పై కామెంట్ చేసి ప్రమోషన్లలో భాగంగా వాడుకోవడానికా అనేది ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.