Raaka: ఐపీఎల్‌లో ‘రాకా’.. ప్రచారం మరీ ఎర్లీ అవ్వడం లేదు కదా?
- April 14, 2026 / 01:01 PM ISTByFilmy Focus Desk
ఎప్పుడూ చెప్పుకునే మాటనే.. సినిమాలు – క్రికెట్ దూరం కాదు.. రెండూ ఒకటే అని. ఇందులో వాళ్లు అందులో వాళ్లకు పరిచయం, అందులో వాళ్లకు ఇందులో వాళ్లు బాగా పరిచయం. అలాగే క్రికెట్ ద్వారా సినిమాలను ప్రమోషన్ చేసుకునే పద్ధతి కూడా ఉంది. గతంలో తక్కువగా ఉండేదేమో కానీ.. సోషల్ మీడియా, ఐపీఎల్ వచ్చాక ఇది ఎక్కువైంది. ‘పుష్ప’ సినిమాలో ‘జూకేగా నై’ డైలాగ్‌ను క్రికెట్‌లో ముఖ్యంగా ఐపీఎల్‌లో ఎంతమంది వాడేశారో మీకు తెలిసిందే. అదేంటి ‘తగ్గేది లే’ కదా అంటారా.. క్రికెటర్లు హిందీలో ‘జూకేగా నై’ అనే అన్నారు మరి.
Raaka
‘పుష్ప’ సినిమాలు వచ్చి కొన్నాళ్లు అయిపోయింది.. ఇప్పుడు ఆ వైబ్ ఆగిపోయింది. ఇప్పుడు ‘పెద్ది’, ‘రాకా’ల మోడ్ నడుస్తోంది. ‘పెద్ది’ సినిమాకు సంబంధించి ఐపీఎల్‌లో ఒకట్రెండు సోషల్ మీడియా వీడియోలు తప్ప.. గేమ్ మధ్యలో ఎక్కడా ఆ ప్రభావం కనిపించలేదు. ఇప్పుడు ‘రాకా’ సినిమాకు సంబంధించి వాడకం మొదలైంది. ఆదివారం నాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్య ఓ సందర్భంలో ‘రాకా’ పోజు పెట్టాడు.

దీంతో ఆ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘రాకా’ పోజు గురించి తెలియనివారికి పాండ్య పోజు ఏంటి అనేది తెలియకపోవచ్చు కానీ.. ఆ పోజు గురించి తెలిసినవాళ్లు ‘ఇదీ మా అల్లు అర్జున్ సత్తా’ అంటూ పొంగిపోతున్నారు. మరి ‘రాకా’ పోస్టర్‌ను పాండ్య చూశాడా? చూసే అలా చేశాడా అనేది ఆయనే చెప్పాలి. ఒకవేళ అదే జరిగితే కోయిల ముందే కూసింది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇలా పోజుల ప్రచారాలు జరిగితే సినిమా రిలీజ్ సమయానికి ప్రచారం స్టఫ్ ఏమీ ఉండదు.
అప్పుడు మళ్లీ కొత్త ఆలోచనలు చేయాలి. ‘రాకా’ రిలీజ్ ఎప్పుడు అనేది చిత్రబృందం ఇప్పటివరకు చెప్పడం లేదు. సుమారు డేట్ కూడా అనౌన్స్ చేయడం లేదు. సినిమా షూటింగ్ కంటే విజువల్ ఎఫెక్ట్స్‌కే ఎక్కువ సమయం పడుతుంది అని అంటున్నారు. కాబట్టి ‘రాకా’ మరో ప్రమోషనల్ స్టఫ్ కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడున్నది ఆల్ రెడీ వాడేశారు కాబట్టి.













