Raayan Review in Telugu: రాయన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • ధనుష్ (Hero)
  • అపర్ణ బాలమురళి (Heroine)
  • సందీప్ కిషన్, కాళిదాస్ జయరాం, ఎస్.జె.సూర్య, సెల్వరాఘవన్, ప్రకాష్ రాజ్ తదితరులు.. (Cast)
  • ధనుష్ (Director)
  • కళానిధి మారన్ (Producer)
  • రెహమాన్ (Music)
  • ఓం ప్రకాష్ (Cinematography)
  • Release Date : జూలై 26, 2024

తమిళ స్టార్ కథానాయకుడు ధనుష్ (Dhanush) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన గ్యాంగ్ స్టర్ డ్రామా “రాయన్” (Raayan). ఇది ధనుష్ 50వ చిత్రం కావడం, రెహమాన్ (A R Rahman) సంగీతం సమకూర్చడంతో ఈ చిత్రం ప్రత్యేకతను సంతరించుకొంది. హార్డ్ కోర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలను “రాయన్” అందుకోగలిగాడా లేదా? అనేది చూద్దాం..!!


కథ: ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతూ తమ్ముళ్ళు (సందీప్ కిషన్ (Sundeep Kishan ) & కాళిదాస్ జయరాం (Kalidas Jayaram) ) మరియు చెల్లెలు (దుషారా విజయన్ ( Dushara Vijayan )తో సంతోషంగా జీవిస్తుంటాడు రాయన్ (ధనుష్). గొడవలకు దూరంగా ఉంటూ.. కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ సజావుగా సాగుతున్న రాయన్ జీవితంలోకి లోకల్ డాన్ దురై & మరో డాన్ రామన్ ఎంటర్ అవుతారు. రాయన్ & తమ్ముళ్ళ మధ్య మనస్పర్ధలు తలెత్తడం, రాయన్ & రామన్ మధ్య సంధి కుదరక గొడవలు జరగడం మొదలవుతుంది. ఈ క్రమంలో రాయన్ ఎలాంటి నిర్ణయం తీసుకొన్నాడు? ఆ నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారి తీసింది? రాయన్ వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.

నటీనటుల పనితీరు: ధనుష్ ఈ సినిమాలో అండర్ ప్లే చేశాడు. చాలా సన్నివేశాల్లో అతడి పాత్ర చాలా సాదాసీదాగా ఉంటుంది. అయితే.. కీలకమైన సన్నివేశాల్లో మాత్రం అతడి నట చాతుర్యం చూపించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ & హాస్పిటల్ బ్లాక్స్ లో ధనుష్ నటన & మ్యానరిజమ్స్ మాస్ ఆడియన్స్ కు విపరీతంగా నచ్చేస్తాయి. సందీప్ కిషన్ కి మంచి పాత్ర లభించింది. రెండుమూడు విభిన్నమైన షేడ్స్ ఉన్న క్యారెక్టర్. ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్ కాకుండా ఆల్మోస్ట్ సెకండ్ హీరో అని చెప్పొచ్చు. తన పాత్రను అద్భుతంగా పండించాడు కూడా.

కాళిదాస్ జయరాం & దుషారా విజయన్ కు పెద్దగా స్కోప్ లేదు. సెల్వరాఘవన్ (Selvarghavan) ఇచ్చే ఎలివేషన్స్ బాగున్నాయి. ప్రకాష్ రాజ్ ( Prakash Raj) పాత్ర చిన్నదే అయినా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. వీళ్ళందరికంటే ఎక్కువగా తన పాత్రతో ప్రేక్షకులను విశేషంగా ఎంటర్ టైన్ చేసింది ఎస్.జె.సూర్య (S J Suryah) . విలనిజాన్ని మరియు హాస్యాన్ని భలే పండించాడు. ఆడియన్స్ ధనుష్ తర్వాత బాగా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ సూర్య పోషించిన రామన్.


సాంకేతికవర్గం పనితీరు: రెహమాన్ సంగీతం సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్. ఈమధ్యకాలంలో రెహమాన్ అందించిన బెస్ట్ బ్యాగ్రౌండ్ స్కోర్ “రాయన్” అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మంచి సౌండింగ్ ఉన్న థియేటర్లో సినిమాను చూడగలిగితే.. రెహమాన్ బ్రిలియన్స్ అర్ధమవుతుంది. ముఖ్యంగా ధనుష్ లోని మృగాన్ని రెహమాన్ ఎలివేట్ చేసిన తీరుకి థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. ఓం ప్రకాష్ సినిమాటిగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది. యాక్షన్ బ్లాక్స్ ను కంపోజ్ చేసిన విధానం బాగుంది. ముఖ్యంగా డార్క్ షాట్స్ లో లైటింగ్ కొత్తగా ట్రై చేయడం రెగ్యులర్ సీన్స్ కి కొత్త ఫ్లేవర్ ఇచ్చింది.

దర్శకుడు, కథకుడు ధనుష్ ఇప్పటికే వందల సంఖ్యలో చూసేసిన గ్యాంగ్ స్టర్ డ్రామాకు వీలైనంత రక్తాన్ని అద్ది చాలా పచ్చిగా చెప్పాలనుకున్న ప్రయత్నం బాగుంది. యాక్షన్ బ్లాక్స్ కంపోజిషన్ విషయంలో మొహమాటపడకుండా ఏరులై పారించిన రక్తం యాక్షన్ లవర్స్ కి మంచి కిక్ ఇస్తుంది. అయితే.. క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం మరీ ఎక్కువ టైమ్ తీసుకొన్నాడు. ఇంటర్వెల్ బ్లాక్ మినహా ఫస్టాఫ్ మొత్తం క్యారెక్టర్స్ ను ఎస్టాబ్లిష్ చేయడానికే సరిపోయింది. అలాగే.. సెకండాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు కూడా అనవసరంగా సాగాయి. అందువల్ల.. ఎంత డ్రామాను ఎంజాయ్ చేసే ఆడియన్స్ అయినా, సదరు ల్యాగ్ ను ఆస్వాదించలేరు. సో, ధనుష్ కథకుడిగా కంటే దర్శకుడిగా ఎక్కువ మార్కులు సంపాదించుకున్నాడు.

విశ్లేషణ: ఓ రొటీన్ మాస్ సినిమాకి మంచి యాక్షన్ & డ్రామా అలంకరించి ప్రేక్షకులకు ధనుష్ వడ్డించిన చిత్రం “రాయన్”. భారీ అంచనాలు పెట్టుకోకుండా.. ధనుష్ దర్శకత్వ ప్రతిభ, సెన్సార్ లేని యాక్షన్ సీన్స్, రెహమాన్ అత్యద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం “రాయన్”ను చూడొచ్చు!

ఫోకస్ పాయింట్: ఫక్తు మాస్ మసాలా డ్రామా “రాయన్”

రేటింగ్: 2.5/5

Click Here to Read In ENGLISH

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus