తెలుగు సినీ సంగీతంలో తనదైన ముద్ర వేసిన మ్యూజిక్ డైరెక్టర్ రధన్ (Radhan) మరోసారి హైలెట్ అయ్యారు. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ (Akkada Ammayi Ikkada Abbayi) సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్‌కి వచ్చిన రధన్, మీడియాతో జరిగిన ఇంటరాక్షన్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేకంగా ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) సినిమాకి సంబంధించిన తనపై వచ్చిన విమర్శలకు క్లారిటీ ఇచ్చారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద వివాదమే అయ్యాయి. అయితే రధన్ మాత్రం వాటిని ఎంతో గౌరవంగా స్వీకరించినట్టు తెలిపాడు.
“సందీప్ గారు నా జీవితాన్ని మార్చిన వ్యక్తి. ఆయన నాకు తండ్రి లాంటి వారు. ఆయన తిట్టినప్పుడు నా నాన్న తిట్టినట్టే అనిపించింది. నాన్న తిడితే మనం బయటకు వెళ్లి చెబుతామా? అదే భావనతో నేను కూడా ఓపికగా తీసుకున్నా” అంటూ భావోద్వేగంతో స్పందించాడు రధన్. అర్జున్ రెడ్డి సంగీతాన్ని అందించేందుకు ఎక్కువ సమయం తీసుకున్నా, తనవంతుగా బెస్ట్ మ్యూజిక్ ఇచ్చానని రధన్ అభిప్రాయపడ్డాడు. తన పని తీరు విషయంలో వచ్చిన విమర్శల గురించి మాట్లాడుతూ “ప్రతీ దర్శకుడి వర్క్ స్టైల్ వేరు.
అనుదీప్ చాలా కూల్‌గా ఉంటారు. సందీప్ గారు మాత్రం ఎంతో ఫాస్ట్‌గా, పదే పదే ఎమోషన్‌లో ఉంటారు. అందరూ ఒకేలా ఉండలేరు కదా” అని చెప్పాడు. తన పని పట్ల ఎంతో నిబద్ధతతో ఉండే తాను, మ్యూజిక్‌ను మాత్రమే ఫోకస్ చేస్తానని స్పష్టం చేశాడు. అంతేకాకుండా, “జాతి రత్నాలు (Jathi Ratnalu), హుషారు (Hushaaru)” లాంటి సినిమాలకు మంచి మ్యూజిక్ ఇచ్చానని, అవన్నీ తనపై పెట్టిన నమ్మకానికి నిదర్శనమని తెలిపాడు.
ప్రస్తుతం ప్రదీప్ మాచిరాజు (Pradeep Machiraju) హీరోగా చేస్తున్న ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ కోసం మంచి ఆల్బమ్ అందించానని చెబుతున్న రధన్, ఈ సినిమాతో తన మ్యూజిక్ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్మకంగా ఉన్నాడు. ఒక సంగీత దర్శకుడిగా విమర్శలను సానుకూలంగా స్వీకరించి, అనుభవాలుగా మార్చుకున్న రధన్ వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సినీ ఇండస్ట్రీలో ఎదిగేందుకు ఆత్మస్థైర్యం ఎంత అవసరమో ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది.