సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా ప్రభుదేవ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “రాధే”. తెలుగు సూపర్ హిట్ చిత్రం “పోకిరి”కి రీమేక్ గా తెరకెక్కిన “వాంటెడ్” చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన ఈ చిత్రానికి కొరియన్ చిత్రం “ది ఔట్ లాస్” మాతృక. అఫీషియల్ రీమేక్ గా రూపొందిన ఈ సీక్వెల్ ను థియేటర్లలో మాత్రమే విడుదల చేస్తానని సల్మాన్ మాట ఇచ్చినప్పటికీ.. పరిస్థితులు సహకరించక జీ5 యాప్ లో విడుదలైంది. వరుస డిజాస్టర్లతో కొట్టుమిట్టాడుతున్న సల్మాన్ “రాధే”తోనైనా హిట్ అందుకోగలిగాడా లేదా అనేది చూద్దాం..!!
కథ: ముంబై మహానగరం, నగరంలోని యువత మాదక ద్రవ్యాల కారణంగా డ్రగ్ ఎడిక్ట్స్ లా మారడమే కాక, వ్యవస్థ నాశనం అవుతుంటుంది. దీనంతటికీ కారణం రాణా (రణదీప్ హుడా) అని తెలిసినప్పటికీ.. అతడి దరిదాపుల్లోకి కూడా ఏ ఒక్క పోలీసు వెళ్లలేకపోతాడు. మనుషుల్ని అత్యంత కిరాతకంగా హతమార్చి తన శాడిజాన్ని చాటుకొనే రాణాను కంట్రోల్ చేయగలిగే ఏకైక మొనగాడు రాధే (సల్మాన్ ఖాన్) అని భావించి ఒక మర్డర్ కేస్ కారణంగా సస్పెన్షన్ లో ఉన్న అతడ్ని ఎరికోరి రాణాను ఎదిరించడం కోసం నియమిస్తారు.
ఇక అక్కడినుంచి కథ ఎలా ముందుకు సాగింది? రాధే వెర్సెస్ రాణా లో ఎవరు ఎలా గెలిచారు? అనేది “రాధే” కథాంశం.
నటీనటుల పనితీరు: సల్మాన్ ఖాన్ కాస్త సన్నబడి, డిఫరెంట్ కాస్ట్యూమ్స్ తో కొత్తగా కనిపించడానికి చాలా ఇబ్బందిపడ్డాడు. మునుపటి స్క్రీన్ ప్రెజన్స్ కనిపించలేదు. పైగా ఓవర్ యాక్టింగ్ చేయడంతో, సల్మాన్ స్క్రీన్ పై కనిపించి.. అనవసరమైన డైలాగులు చెబుతున్నప్పుడల్లా చిరాకొస్తుంటుంది.
సల్మాన్ కంటే రణదీప్ హుడా అద్భుతంగా నటించాడు. రాణా పాత్రలో సైకోగా రణదీప్ నటన సినిమాకి ఏకైక ప్లస్ పాయింట్.
దిశా పటాని బట్టలతోపాటు, హావభావాల విషయంలోనూ చాలా పొదుపు పాటించింది. ఆమె గ్లామర్ కోసం చూసే జనాలకు ఫుల్ మీల్స్. ఇక సాంగ్స్ లో అమ్మడి కాస్ట్యూమ్స్ ఉన్నంత పొట్టిగా ఈ మధ్యకాలంలో ఐటెమ్ సాంగ్స్ లో నర్తించే భామల బట్టలు కూడా ఉండకపోవడం గమనార్హం.
సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ తో కామెడీ చేయిద్దామని, అతడి చేత చేయించిన వెకిలి పనులు హేయంగా ఉన్నాయి. ముఖ్యంగా పొట్టి గౌన్ లో జాకీ ష్రాఫ్ & సల్మాన్ చేసే డ్యాన్స్ సినిమా మొత్తంలో మోస్ట్ ఇరిటేటింగ్ పార్ట్.
తమిళ నటుడు భరత్, నటి మేఘా ఆకాష్, తెలుగు నటుడు నర్రా సినిమాలో ఎందుకున్నారో అర్ధం కాదు. ప్రత్యేకించి వారిని ఎందుకు సినిమాలో తీసుకున్నాడో ప్రభుదేవాకే తెలియాలి.
సాంకేతికవర్గం పనితీరు: ముగ్గురు సంగీత దర్శకులు కలిసి అందించిన మూడు పాటలు వినడానికి ఎలా ఉన్నా.. సల్మాన్ ఓవర్ యాక్షన్ పుణ్యమా అని చూడ్డానికి మాత్రం చిరాగ్గానే ఉన్నాయి. అన్నిటికీ మించి ప్లేస్ మెంట్ అస్సలు బాలేదు.
ఆయానంక బోస్ సినిమాటోగ్రఫీ ఒక్కటే టెక్నికల్ గా స్ట్రాంగ్ అని చెప్పుకొనే ఏకైక అంశం. కంటెంట్ తో సంబంధం లేకుండా రిచ్ విజువల్స్ తో అలరించాడు. ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ప్రొడక్షన్ డిజైన్ కూడా బాగుంది.
దర్శకుడు ప్రభుదేవ కొరియన్ ఒరిజినల్ ఫిల్మ్ ను “వాంటెడ్”కి సీక్వెల్ గా రాసుకొన్న విధానం బాగానే ఉన్నా.. స్క్రీన్ ప్లే & సీన్ కంపోజిషన్ విషయంలో మాత్రం ఇంకా తన తొలి చిత్రం పరిధిలోనే ఉండిపోయాడు. అందువల్ల కథ ఇంట్రెస్టింగ్ గానే ఉన్నా, కథనం, సన్నివేశాలు మాత్రం పిచ్చి బోర్ కొట్టిస్తాయి. ముఖ్యంగా లేకి కామెడీ, అనవసరమైన ఎలివేషన్స్ పరమ బోరింగ్. మరీ కామెడీగా “దమ్ము” సినిమాలో ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ ను సల్మాన్ కోసం వాడడం అనేది పెద్ద జోక్. సరే ఇన్ని మైనస్ లు ఉన్నాయి కదా, కనీసం సల్మాన్-ప్రభుదేవ మార్క్ కామెడీ అయినా ఉంటుందేమో అనుకుంటే.. అది కూడా హాస్యం కాదు అపహాస్యం అని అవగతమయ్యేసరికి సినిమా మీద ఉన్న కొద్దిపాటి ఆసక్తి కూడా తగ్గిపోతుంది. దర్శకుడిగా, కథకుడిగా ప్రభుదేవా దారుణంగా విఫలమయ్యాడు.
విశ్లేషణ: ఆన్ లైన్ లో ఫార్వార్డ్ చేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి సరిపోయింది కానీ, ఒకవేళ థియేటర్లలో విడుదలై ఉంటే.. సినిమాలోని ల్యాగ్, లేకి కామెడీ, సల్మాన్ ఓవర్ యాక్షన్ భరించలేక ఆడియన్స్ థియేటర్ల నుంచి వాకౌట్ చేయడం లేదా పరుగులు తీయడం లాంటివి జరిగేవి. సల్మాన్ ఖాన్ కెరీర్ లోనే వరస్ట్ మూవీగా “రాధే” నిలిచిపోతుంది.