Radhe Shyam Review: రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • March 11, 2022 / 01:13 PM IST

ప్రభాస్-పూజా హెగ్డే జంటగా “జిల్” ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియన్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్”. దాదాపు 4 ఏళ్ల పాట్లు షూటింగ్ జరుపుకొని, ఏడాది నుండి విడుదల విషయంలో జాప్యం జరుగుతూ ఎట్టకేలకు నేడు (మార్చి 11) ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం ఒరిజినల్ ట్రైలర్ కంటే రిలీజ్ ట్రైలర్ కాస్త ఆసక్తి పెంచింది. మరి సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలను అందుకోగలిగిందో లేదో చూద్దాం..!!

కథ: ఇండియాలో ఇంధిరాగాంధీ భవిష్యత్ లో ఏం చేయబోతోందో చెప్పిన తర్వాత ఇటలీ వెళ్ళిపోతాడు విక్రమాదిత్య (ప్రభాస్). అక్కడ తొలిచూపులోనే డాక్టర్ ప్రేరణ (పూజ హెగ్డే)ను ప్రేమిస్తాడు. మన లైఫ్ మొత్తం ఆల్రెడీ రాసిపెట్టిన విధంగానే సాగుతుంది అని నమ్మే విక్రమాదిత్య.. ప్రేమ విషయంలో మాత్రం తన నమ్మకాన్ని మార్చుకోవాల్సి వస్తుంది. అందుకు కారణం ప్రేరణ.

అసలు విక్రమాదిత్య-ప్రేరణల మధ్య ప్రేమ చిగురించడానికి కారణం ఏమిటి? ఆ ప్రేమ నుండి విక్రమాదిత్య ఎందుకు పారిపోవాలనుకుంటాడు? ఈ ఇద్దరి ప్రేమతో విధి ఆడిన వింత నాటకం ఏమిటి? అనేది “రాధేశ్యామ్” కథాంశం.

నటీనటుల పనితీరు: నటుడిగా ప్రభాస్ ఒక డిఫరెంట్ రోల్ ప్లే చేసిన విశేషమైన రీతిలో ఆకట్టుకున్నాడు. ప్రభాస్ అభిమానులకు అతడ్ని అలా చూడడం కాస్త కష్టమే. కాస్ట్యూమ్స్ గట్రా అన్నీ బాగున్నప్పటికీ.. లుక్స్ మాత్రం జీర్ణించుకోలేని విధంగా ఉన్నాయి.

పూజా హెగ్డే విషయంలోనూ అంతే.. ఆమె కాస్ట్యూమ్స్ & మేకప్ లో ఉన్న కళ ముఖంలో కనిపించలేదు. నటిగా మాత్రం పర్వాలేదనిపించుకుంది.

భాగ్యశ్రీ, సత్యరాజ్, జగపతిబాబు, ప్రియదర్శి ఇలా పేరున్న ఆర్టిస్టులు బోలెడుమంది ఉన్నప్పటికీ.. ఎవరికీ సరైన సన్నివేశం లేకపోవడంతో ఏ ఒక్కరి పాత్ర సరిగా రిజిస్టర్ అవ్వలేదు.

సాంకేతికవర్గం పనితీరు: మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్. రవీందర్ ఆర్ట్ వర్క్ మరో ఎస్సెట్. ఈ రెండు టెక్నికాలిటీస్ కోసమైన సినిమాని కనీసం ఒక్కసారైనా చూడాలనిపిస్తుంది. మనోజ్ పరమహంస చిత్రాన్ని ఓ అందమైన దృశ్యకావ్యంలా మలచగా.. రవీందర్ ఆర్ట్ వర్క్ 70ల కాలంలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లిపోయింది. ఇంత అద్భుతమైన టెక్నికల్ వర్క్ కి సరైన స్క్రిప్ట్ వర్క్ లేకపోవడంతో వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరకలేదు.

జస్టిన్ ప్రభాకర్ పాటలు వినడానికి ఎంత వినసోంపుగా ఉన్నాయో.. చూడ్డానికి అంతే యావరేజ్ గా ఉన్నాయి. తమన్ నేపధ్య సంగీతం బాగుంది.

దర్శకుడు రాధాకృష్ణ ఒక మీడియం రేంజ్ హీరోతో చేయాల్సిన సబ్జెక్ట్ కు అనవసరమైన హంగులు జోడించి పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో తీశాడు అనిపిస్తుంది. ప్రభాస్ లాంటి స్టార్ తో డెత్ ప్రాక్టీసింగ్ ఎపిసోడ్, అది కూడా దాదాపు 5 నిమిషాలు పెట్టడం ఏమిటో, కంగారుకంగారుగా క్లైమాక్స్ ను ముగించడం ఏమిటో, పూజా హెగ్డే బ్రతకడానికి ఒక జస్టిఫికేషన్ ఇవ్వకపోవడం ఏమిటో, జగపతిబాబు ట్రాక్ ను ఇరికించడం ఎందుకో, ప్రియదర్శి, మురళీశర్మ వంటి నటులను ఒకట్రెండు డైలాగులతో సినిమాలో బ్యాగ్రౌండ్ ఆర్టిస్టుల్లా నిల్చోబెట్టడం ఏమిటో, ఇలా బోలెడన్ని ఏమిటోలను దర్శకుడిగా, కథకుడిగా రాధాకృష్ణ జస్టిఫై తెరపై చూపించలేకపోయాడు. సో, దర్శకుడిగా అద్భుతమైన క్యాస్టింగ్, కాస్టింగ్ ను సరిగా యూటిలైజ్ చేసుకోలేకపోయిన రాధాకృష్ణ, కథకుడిగా ప్రేక్షకుల్ని కూడా అలరించలేకపోయాడు.

విశ్లేషణ: ప్రభాస్ వీరాభిమానులు సైతం బాధపడే సినిమాగా “రాధేశ్యామ్” మిగిలిపోతుంది. అందుకు మూలకారకుడిగా మాత్రం దర్శకుడు-కథకుడు రాధాకృష్ణ చరిత్రలో నిలిచిపోతాడు. దాదాపు అయిదేళ్లపాటు రాసుకున్న కథ, నాలుగేళ్లపాటు షూటింగ్, రెండేళ్ల పోస్ట్ ప్రొడక్షన్, ఏడాది వెయిటింగ్. ఇంత కాలంలో రాధాకృష్ణ క్లైమాక్స్ ను సరిగా రాసుకోకపోవడమే కాక ఇంత పేలవమైన కథ-కథనంతో పాన్ ఇండియన్ మూవీ తీయడం అనేది బిగ్గెస్ట్ బ్లండర్. నార్త్ ఆడియన్స్ కి ఏమైనా నచ్చి కాస్త ఎంకరేజ్ చేస్తే తప్ప సినిమాకి మినిమమ్ కలెక్షన్స్ కష్టమే.

రేటింగ్: 2/5

Click Here To Read in ENGLISH

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus