దేశ సినిమా రంగాన్ని ఓ కుదుపు కుదిపేసి అంశం జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు. మలయాళ సినిమా పరిశ్రమలో మహిళలు దయనీయ స్థితిలో పని చేస్తున్నారు, కనీస సౌకర్యాలు, గౌరవం కూడా దక్కడం లేదు అంటూ కొన్ని విషయాలను ఉదాహరణగా చెబుతూ జస్టిస్ హేమ కమిటీ ఓ రిపోర్టు ఇచ్చింది. అందులో ఎవరెవరి పేర్లు ఉన్నాయి అనేది తెలియదు కానీ.. విషయం మాత్రం సీరియస్. అయితే ఈ విషయంలో ప్రముఖ నటుడు రజనీకాంత్ (Rajinikanth) స్పందిస్తూ.. తనకు విషయం గురించి తెలియదు అని చెప్పారు.
దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా ఈ విషయంలో ప్రముఖ నటి రాధిక ( Radhika Sarathkumar) స్పందించారు. ‘ఆయనకు జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు గురించి తెలిసి ఉంటే కచ్చితంగా మాట్లాడేవారు.. తెలియదు కాబట్టే ఏం మాట్లాడలేదు’ అని చెప్పారు. దాంతోపాటు స్టార్ హీరోలకు కొన్ని సూచనలు కూడా చేశారు. హేమ కమిటీపై అగ్ర నటీనటులు మౌనం వహించడాన్ని రాధిక (Radhika Sarathkumar) తప్పుపట్టారు. ‘మీ మౌనాన్ని ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటారు.
అగ్రతారలంతా ఈ విషయం గురించి మాట్లాడాలి. స్టార్ హీరోల మాటలు ఉపశమనమిస్తాయి. వేధింపులకు గురైన మహిళల్లో న్యాయంపై ఆశను కలిగిస్తాయి అని ఆమె పిలుపునిచ్చారు. అలాగే ప్రజలు కూడా ఈ సమస్యపై మాట్లాడాలి అని ఆమె కోరారు. అంతేకాదు బాధిత మహిళల తరపున మాట్లాడాలని తన భర్త (ప్రముఖ నటుడు శరత్ కుమార్)కు (Sarathkumar) చెప్పినట్లు రాధిక వెల్లడించారు. వేధింపులకు గురైన మహిళలకు అగ్రనటీనటులు మాట్లాడే మాటలు భరోసాను ఇస్తాయి.
అత్యధిక పారితోషికం తీసుకుంటున్న అగ్రనటులు ఈ విషయలో స్పందించాలని నా భర్తకు చెప్పాను అని రాధిక తెలిపారు. ఇప్పటికే ఈ విషయంలో ప్రముఖ నటులు మమ్ముట్టి (Mammootty) , మోహన్‌లాల్ (Mohanlal) స్పందించారు. చిత్రీకరణ ప్రదేశాల్లో మహిళలకు సురక్షిత వాతావరణం ఉండేందుకు నివేదికలో సూచించిన అంశాలను స్వాగతిస్తున్నానని మమ్ముట్టి అన్నారు. హేమ కమిటీకి సంబంధించిన ప్రతి ప్రశ్నకు మొత్తం సినీపరిశ్రమ సమాధానం చెప్పాలని మోహన్‌లాల్ పేర్కొన్నారు. ఇప్పటికే ఈ విషయంలో మలయాళ నటుల సంఘం ‘అమ్మ’ అధ్యక్ష పదవికి మోహన్ లాల్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.