ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల ధరల విషయంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న వివాదం గురించే మీకు తెలిసే ఉంటుంది. టికెట్‌ల ధరల విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న శైలి పట్ల టాలీవుడ్ నుండి చిన్నగా ప్రశ్నలు వస్తున్నాయి. అయితే కలసికట్టుగా అందరూ వెళ్లి అడిగే పరిస్థితి అయితే రాలేదు. ఇండస్ట్రీ వాళ్లు అడుగుతున్న ప్రశ్న… ఇంత తక్కువ ధరలతో థియేటర్లను ఎలా మెయింటైన్ చేయడం?. అయితే ఈ విషయంలో ప్రేక్షకుల గురించి పట్టించకోవడం లేదా? దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాటలు చూస్తే అలానే అనిపిస్తోంది.
టికెట్ రేట్లు, షోల తగ్గింపు వల్ల సినిమా పరిశ్రమకు సంబంధించి చాలామంది తీవ్ర నష్టాలకు గురవుతారంటూ రాఘవేంద్రరావు ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఓ ప్రకటన విడుదల చేశారు. ఆన్‌లైన్ టికెటింగ్ విధానం వల్ల దోపిడి ఆగిపోతుందనడం సరికాదన్న దర్శకేంద్రుడు… ప్రేక్షకుడు మంచి సినిమా చూడాలనుకుంటే టికెట్ ధర రూ.300 అయినా.. రూ.500 అయినా చూస్తాడు అని చెప్పుకొచ్చారు. అంతేకాదు రూపాయికే సినిమా చూపిస్తామన్నా అతనికి నచ్చని సినిమా చూడడు అని కూడా అన్నారు.
అయితే టికెట్ ధరల విషయంలో చాలా ఏళ్ల నుండి తెలుగు ప్రేక్షకులు ఎదుర్కొంటున్న సమస్య… అధిక ధరలు. పండగ నాడు ఓ సినిమా చూద్దామూ అనుకుంటే… ఒక్కో టికెట్ ధర సాధారణ రేటు కంటే డబుల్ అయిపోతోంది. అంటే 100 రూపాయల టికెట్ 200,300 అయిపోతోంది. దీని గురించి ప్రేక్షకులు అరచి, గోల చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు దర్శకేంద్రుడు కూడా అదే మాట అంటున్నారు. మేం ఎంత ధర అనుకుంటే అంత పెట్టుకునేలా ఉండాలి. ప్రేక్షకులు వస్తారు, చూస్తారు అని. ఇలా అడ్డగోలు ధరలు పెట్టడం ప్రేక్షకుడిని ఇబ్బంది పెడుతుందనే విషయం మరచిపోకూడదు.