గతంలో ‘బంపర్ ఆఫర్’.. రవితేజ ‘దేవుడు చేసిన మనుషులు’ వంటి సినిమాలకు సంగీతం అందించి మంచి పేరు సంపాదించుకున్న.. బుల్లితెర యాంకర్,గాయకుడు,సంగీత దర్శకుడు అయిన రఘు కుంచెకు ఆ తరువాత పెద్దగా గుర్తింపు రాలేదు. ఇప్పుడు ఈషా రెబ్బా, సత్యదేవ్ ప్రధాన పాత్రలు పోషించిన ‘రాగాల 24 గంటల్లో’ సినిమాకి సంగీత దర్శకుడి పనిచేసాడు. ప్రమోషన్లలో భాగంగా ఆయన మాట్లాడుతూ ..”శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో గతంలో వచ్చిన ‘మామ మంచు అల్లుడు కంచు’ సినిమాకి కూడా నేను పనిచేశాను.
మా కాంబినేషన్లో ఇది రెండో సినిమా. ఈ సినిమాకి సంగీతంతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అందించాను. నాపై ఉన్న నమ్మకంతో ఆయన ఈ అవకాశం ఇచ్చినందుకు ఆనందంగా వుంది. గతంలో నేను సంగీతాన్ని అందించిన రెండు మూడు సినిమాలకి వేరే సంగీత దర్శకుడు రీ రికార్డింగ్ చేశాడు. నేను చేయవలసిన వర్క్ ను ఆయన నా నుంచి లాక్కున్నాడు. అలా ఆ అవకాశాలు పోవడం నాకు చాలా బాధ కలిగించింది. మొదటి నుంచి వున్నవారు చేసే పనికి .. మధ్యలో వచ్చి చేరేవారు చేసే పనికి తప్పకుండా తేడా వుంటుంది. ‘రాగాల 24 గంటల్లో’ రీ రికార్డింగ్ పరంగా కూడా నాకు మంచి పేరు తెస్తుంది” అంటూ చెప్పుకొచ్చాడు రఘుకుంచె.