నటనతో సంపాదించుకున్న పేరు కంటే.. కాంట్రవర్శీ ట్వీట్లతో ఏ నటుడైనా పేరు సంపాదించుకున్నారు అంటే అది రాహుల్ రామకృష్ణ అనే చెప్పాలి. చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఆయనకు నటుడిగా మంచి పేరే ఉంది. అయితే కొన్నిసార్లు ఏమవుతుందో ఏమో.. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఎవరూ ఊహించని విషయాల మీద సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. అక్కడికి కాసేపటికి, కొన్ని రోజులకు తన సోషల్ మీడియా ఖాతా తన అధీనంలో లేదు అని మరో చర్చకు దారి తీస్తుంటారు. ఇప్పుడు మరోసారి ఇదే జరిగింది.
‘అర్జున్ రెడ్డి’ సినిమాలో మంచి పేరు సంపాదించి టాలీవుడ్ స్టార్ కమెడియన్లలో ఒకడిగా అనతికాలంలోనే ఎదిగారు రాహుల్ రామకృష్ణ. సోషల్ మీడియాలో ముఖ్యంగా ఎక్స్‌లో రాహుల్ రామకృష్ణ యాక్టివ్‌గా ఉంటారు. ఈ క్రమంలో సినిమా అంశాలతోపాటు, సామాజిక, రాజకీయ అంశాల మీద కూడా పోస్టులు పెడుతుంటారు. అలా ఇటీవల తెలంగాణ రాజకీయాల నేపథ్యంలో ఓ పోస్టు పెట్టారు. అధికార కాంగ్రెస్ పార్టీ మీద ఘాటు విమర్శలు చేశారు. మళ్లీ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి కేసీఆర్ రావాలి అంటూ అని కూడా రాశారు.
అక్కడితో ఆగకుండా గాంధీ జయంతి రోజు మహాత్మా గాంధీకి వ్యతిరేకంగా మరో పోస్టు పెట్టారు. అయితే అక్కడికి కొన్ని గంటల్లోనే రాహుల్ రామకృష్ణ ఎక్స్ అకౌంట్ పూర్తిగా డీయాక్టివేట్ అయిపోయింది. తొలుత ‘హైదరాబాద్ మునిగిపోయింది. మీ హామీలన్నీ విఫలమయ్యాయి. అన్నీ చక్కదిద్దడం కోసం జనాలు కేసీఆర్ మళ్లీ రావాలని కోరుకుంటున్నారు’ అని రాహుల్ రామకృష్ణ రాశారు. గాంధీ సాధువు కాదని, మహాత్ముడు కాదని మరో పోస్టులో రాసుకొచ్చారు.
ఈ పోస్టులు తీవ్ర చర్చకు దారితీయడంతో తన అకౌంటును ఎవరో హ్యాక్ చేశారంటూ రాహుల్ అంటున్నారట. మరి నిజంగానే హ్యాక్ అయిందా? లేక ఏం జరిగిందా అనేది ఆయనే చెప్పాలి. అయితే హ్యాక్ చేసినవాళ్లు ప్రస్తుత తెలంగాణ రాజకీయాల గురించే ఎందుకు పోస్టులు పెడతారు. గాంధీ గురించి ఎందుకు రాస్తారు అనే చర్చ మరికొంతమంది లేవనెత్తుతున్నారు.