దర్శకుడికి అనువైన టెక్నీషియన్స్ తోడుంటే విజయం వెన్నంటే ఉంటుంది. అలాగే రాజమౌళి ఇప్పటి వరకు సంగీత దర్శకుడిగా ఎం ఎం కీరవాణిని తీసుకుంటూ వస్తున్నారు. ఆయన కథకి తన సంగీతంతో ప్రాణం పోస్తున్నారు. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న చిత్రానికి కూడా కీరవాణి పనిచేయనున్నారు. ఇక కెమెరా మెన్ గా ‘మర్యాదరామన్న’ మినహా.. ‘సై’ మొదలు ‘బాహుబలి’ వరకూ సెంథిల్ కుమార్ పనిచేశారు. అతను రాజమౌళి ఆలోచనను వెండితెరపై ఆవిష్కరించడానికి చాలా కష్టపడేవారు. ఈసారి మాత్రం సెంథిల్ కుమార్ పనిచేయడం లేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలయికలో రూపుదిద్దుకోనున్న మూవీకి
హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ డాని లోపెజ్ ను తీసుకోబోతున్నారు. మహానటి చిత్రానికి పనిచేసిన డాని లోపెజ్ పనితనం నచ్చడంతో తన కొత్త సినిమాకు సెంథిల్ కుమార్‌కు బదులుగా తీసుకోబోతున్నారని ఫిలిం నగర్ వాసులు చెప్పారు. దీంతో అనేక రూమర్లు మొదలయ్యాయి. రాజమౌళి, సెంథిల్ కి మధ్య గొడవ జరిగిందని చెప్పుకుంటున్నారు. వీరిద్దరి మధ్య ఏమి జరిగిందని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. విక్రమ్ హీరోగా ‘మహావీర్ కర్ణన్’ పేరుతో ఓ భారీ సినిమా అక్టోబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. 300 కోట్లతో , ఆర్.ఎస్ విమల్ దర్శకత్వంలో తమిళ, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రం.. ఇతర భాషల్లోనూ డబ్ కానుంది. ఈ భారీ ప్రాజెక్ట్ సెంథిల్ కి మరో సారి మంచి పేరు తెచ్చి పెడుతుందని భావించి రాజమౌళే స్వయంగా పంపించారని తెలిసింది.