శ్రీవల్లికి ప్రముఖ దర్శకుడు రాజమౌళి వాయిస్‌ఓవర్

ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం శ్రీవల్లి. రజత్, నేహాహింగే జంటగా నటిస్తున్నారు. రేష్మాస్ ఆర్ట్స్ పతాకంపై సునీత, రాజ్‌కుమార్ బృందావనం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 15న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు, విజయేంద్రప్రసాద్ తనయుడు రాజమౌళి వాయిస్‌ఓవర్ చెప్పడం విశేషం. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ తండ్రి దర్శకత్వంలో రాబోతున్న చిత్రానికి తనయుడు వాయిస్‌ఓవర్ ఇవ్వడం ఎంతో ఆనందంగా వుంది. ఓ వైవిధ్యమైన కథతో విజయేంద్రప్రసాద్ గారు ఎంతో అద్భుతంగా చిత్రాన్ని తీర్చిదిద్దారు. తప్పకుండా చిత్రం అన్ని వర్గాల ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది అని తెలిపారు. విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఎరోటిక్ థ్రిల్లర్ చిత్రమిది. పేరున్న నటీనటులు వారి ఇమేజ్‌ను పక్కనపెట్టి కొత్త తరహా సినిమాలు చేసినా అవి ఆకట్టుకోవడం కష్టం. ప్రేక్షకులకు తొందరగా రుచించవు.

ఎలాంటి ఇమేజ్‌లేని కొత్త నటీనటులయితే పాత్రల కంటే కథపైనే దృష్టిపెట్టి సినిమాను బలంగా తెరపై చూపించడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే నూతన తారలతో ఈ సినిమా చేశాను. ప్రోటాన్స్, న్యూట్రన్స్‌తో పాటు విశ్వాంతరాలలో లక్షల కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఖగోళాలను మనసుతో చూడగలుగుతున్నాం. అలాంటి మనసును కొలవగలిగితే, చూడగలిగితే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచి ఈ కథ పుట్టింది. పుట్టుకతో ఏ మనిషి దొంగ, వ్యసనపరుడు కాడు. పరిస్థితులే వారిని అలా మారుస్తాయి. ఆ మార్పును సరిదిద్ది వారిని స్వచ్ఛమైన మనస్కులుగా మళ్లీ మార్చగలిగితే ఎలా ఉంటుందనే అంశాన్ని సినిమాలో చూపించాం. ఓ అమ్మాయి మనసుపై శాస్త్రవేత్త చేసిన ప్రయోగం కారణంగా ఆమెకు గతజన్మలోని ప్రియుడితో పాటు స్మృతులు గుర్తుకువస్తాయి. ఆ తర్వాత ఆమె జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయన్నది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది అని తెలిపారు. రాజీవ్‌కనకాల, సత్యకృష్ణ, హేమ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎమ్.ఎమ్ శ్రీలేఖ, కెమెరా: రాజశేఖర్.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus