రాధే శ్యామ్ సమయానికి ఆదనపు షోలు, టికెట్ల ధరల పెంపు ఉంటుందని అనుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇండస్ట్రీకి పెద్ద షాక్ ఇచ్చేసింది. మాటల వరకే ఏపీ సర్కారు ఇండస్ట్రీకి ఆశ చూపిస్తోంది. రాధే శ్యామ్ కు ఏపీ లో తక్కువ టికెట్ల ధరలతో ప్రభావం తీవ్రంగానే పడింది. ఇక పర్సనల్ గా మాట్లాడితే గాని లాభం ఉండదని అనుకున్న దర్శకుడు రాజమౌళి సోమవారం రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేకంగా కలవడం జరిగింది.
నిర్మాత డివివి.దానయ్యతో కలిసి విజయవాడకు వెళ్లిన రాజమౌళి మీటింగ్ అనంతరం మీడియా ముందుకి వివరణ ఇచ్చారు. ఆయన బాగా రిసీవ్ చేసుకున్నారని ఒక సినిమాకు ఏమి చేయాలో అది చేస్తామని ముఖ్యంగా RRR పెద్ద సినిమా కాబట్టి అవసరమైనంత వరకు చేయడానికి రెడీగా ఉన్నట్లు సీఎం ప్రామిస్ చేసినట్లు రాజమౌళి చెప్పడం జరిగింది. అయితే రాజమౌళి అలా చెప్పిన కొద్దిసేపటికే ఏపి సినిమాటోగ్రఫీ మంత్రి గారు గాలి తీసేసినంత పని చేశారు.
రాజమౌళి చెప్పిన దాన్ని బట్టి తప్పకుండా సీఎం దేశం గర్వించదగ్గ సినిమా చేసిన రాజమౌళి సినిమాకైనా ఆదనపు షోలు, టికెట్ల ధరల పెంపు కు అనుమతులు ఇస్తారని ఆశించారు. కానీ మంత్రి పేర్ని నాని మాటలు విన్న అనంతరం రాజమౌళికి కూడా చేదు అనుభవమే ఎదురైనట్లు తెలుస్తోంది. కొత్త టికెట్ల రేట్లపై ప్రభుత్వం ఇచ్చిన జీవోపై ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పడానికే రాజమౌళి, దానయ్య వచ్చారని ఆయన తేల్చేశారు.
రాజమౌళి జగన్ ను కలవడంపై స్పందించిన నాని ఏపీలో అసలు బెన్ఫిట్ షోలకు తమ ప్రభుత్వం వ్యతిరేఖమే అంటూ టికెట్ల ధరల విషయంలో ఒక్కొక్కరికి ఒకేలా ఉండదని రాజమౌళి సినిమాకి ఒక రేటు మరొక సినిమాకు ఒక రేటు ఉండదని నిబంధనలకు అనుగుణంగానే టికెట్ల రేట్లు ఉంటాయని అన్నారు. దీంతో రాజమౌళి చర్చలకు ఏ మాత్రం ఉపయోగం లేకుండా పోయిందని అర్ధమవుతోంది. ఇక రేట్లు పెరగక పోతే మాత్రం ఆంధ్ర ఏరియాలో RRR ఏరియా హక్కులను భారీగా తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.