తెలుగు సినిమాను ఆ విధంగా భారతీయ సినిమాను ప్రపంచ వేదికపై నిలువెత్తున నిలబెట్టిన దర్శకుల్లో ప్రథములు ఎస్.ఎస్.రాజమౌళి. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలతో ఆయన తన ఘనతను, భారతీయ సినిమా ఘనతను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు తెలిసేలా చేశారు. ఇప్పుడు ఆయన గత సినిమాలు వరల్డ్ వైడ్‌గా ఆదరణను పొందుతున్నాయి. ‘ఈగ’ సినిమాను ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు అరుదైన గౌరవం దక్కింది.
ఫ్రాన్స్‌లోని ప్రతిష్ఠాత్మక లూమియర్ మ్యూజియంలో రాజమౌళి పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా గౌరవాన్ని అందుకున్నారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ డైరెక్టర్ థియరీ ఫ్రేమో ఇటీవల రాజమౌళిని ఆహ్వానించి సత్కరించారు. ఆ తర్వాత ఊహించని సర్‌ప్రైజ్ కూడా ఇచ్చారు. మార్టిన్ స్కోర్సెసీ, క్లింట్ ఈస్ట్‌వుడ్, క్వింటన్ టరంటినో లాంటి లెజెండరీ దర్శకుల నేమ్ బోర్డులు ఉండే ‘మ్యూర్ డే సినియాస్ట్’ (దీనిని ఫిల్మ్ మేకర్స్ వాల్ అని అంటారు)పై రాజమౌళి పేరు కూడా పెట్టారు.
అంతమంది దర్శకుల మధ్య తన పేరును చూసి రాజమౌళి భావోద్వేగానికి గురయ్యారు. జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకం ఇదని, ఈ గౌరవాన్ని ఎప్పటికీ మరువలేనని ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఈ వాల్ సంగతి చూస్తే.. సినిమాను కనిపెట్టిన లూమియర్ బ్రదర్స్ జ్ఞాపకార్థం ఫ్రాన్స్‌లోని లియాన్ నగరంలో ‘లూమియర్ మ్యూజియం’ను ఏర్పాటు చేశారు.
లుమియర్ ఇన్‌స్టిట్యూట్ జూన్ చివరి వారం నుండి జూలై మధ్య వరకు ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’, ‘ఈగ’ సినిమాలతో ప్రత్యేక ‘రెట్రోస్పెక్టివ్’ను నిర్వహిస్తోంది. దీని కోసమే రాజమౌళి ప్రస్తుతం పారిస్‌లో పర్యటిస్తున్నారు. అన్నట్లు ఇటీవల పారిస్‌లోని సినిమాథెక్ ఫ్రాన్సైస్ అనే థియేటర్‌లో రాజమౌళి పేరుతో ఒక శాశ్వత సీటును కేటాయించిన విషయమూ తెలిసిందే.