మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో ఓ సినిమా ఓ దశాబ్దం క్రితం అనౌన్స్ అయింది. ఈ సినిమా చిత్రీకరణ మొదలై ఓ ఏడాది అయింది. అయితే అనుకున్న పేస్‌లో సినిమా షూటింగ్ జరుగుతోందా అంటే లేదనే చెప్పాలి. లేదు లేదు మా ప్లానింగ్ ప్రకారమే మధ్యలో గ్యాప్‌లు ఇస్తున్నాం అని టీమ్ చెబితే ఏమీ చేయలేం కానీ. సినిమా షూటింగ్ అయితే పాసింజర్ రైలులా ఆగి ఆగి సాగుతోంది. దీనికి బడా ‘బాహుబలి’ కూడా ఓ కారణం. మరి ఆ సినిమా కోసం ఏం చేశారో తెలియాలి కదా.
ప్రసాద్ దేవినేనితో కలసి శోభు యార్లగడ్డ నిర్మించిన చిత్రాలు ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కంక్లూజన్’ సినిమాలు కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో ఈ నెల 31న విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ‘బాహుబలి 1’ సినిమా విడుదలై పదేళ్లు అవుతున్న సందర్భంగా ఈ రిలీజ్ లాంటి రీరిలీజ్ పెట్టుకున్నారు. దీని కోసం రాజమౌళి మరోసారి ఎడిట్ టేబుల్ దగ్గర కూర్చుని చాలా సన్నివేశాలకు కత్తిరేశారు. ఈ విషయాల్ని శోభు ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

‘బాహుబలి 1’ రీరిలీజ్ ఆలోచన తొలుత నిర్మాత శోభు యార్లగడ్డకు వచ్చిందట. ఇదే విషయాన్ని దర్శకుడు రాజమౌళితో చెబితే… రెండు భాగాల్నీ కలిపి ఒకే సినిమాగా విడుదల చేద్దాం, దాంతో ప్రేక్షకులకు కొత్త అనుభవాన్ని ఇవ్వగలుగుతాం అని అన్నారట. అయితే రాజమౌళికి అంత సమయం దొరుకుతుందా అని శోభు అనుకున్నరట. అదే మాట అంటే.. ఎలాగైనా కాస్త సమయం తీసుకుని చేసేద్దాం అని అన్నారట. అలా ఆయనే ఎడిట్ చేయించి ‘బాహుబలి: ది ఎపిక్’ సినిమాను సిద్ధం చేశారట.
ఈసారి ఎడిట్ చాలా కష్టంగానే సాగిందట. ఏది ఉంచాలి, ఏది తీసేయాలనే విషయాలపై పెద్ద చర్చలే సాగాయట. చివరికి ఆయనే ఒక కొత్త కట్‌ని డిజైన్ చేశారట. అందుకు తగ్గట్టుగా ఎడిటర్ తమ్మిరాజు, మ్యూజిక్ డైరక్టర్ కీరవాణి, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ సహకారం తీసుకుని ‘బాహుబలి: ది ఎపిక్’ సినిమాను సిద్ధం చేశారట. ముక్కలు ముక్కలుగా సినిమా అతికించినట్టుగా కాకుండా… అంతా ఒక సినిమాలాగే ఉండాలని చూశారట. సౌండ్‌ని సింక్ చేయడానికి చాలాచోట్ల రీవర్క్ చేశారట.

అలాగే పదేళ్ల క్రితం ఉన్న టెక్నాలజీ ఇప్పుడు లేదు. అందుకే 4K విజువల్స్ కోసం గ్రేడింగ్, ఐమాక్స్ రీమాస్టర్, డాల్బీ విజన్ పిక్చర్, అట్మాస్ ప్లస్, 4 డీఎక్స్, ఎపిక్ లాంటి మార్పులు చేయడాఇనికి మరోసారి దాదాపుగా పోస్ట్ ప్రొడక్షన్ చేశారట. ఒక విధంగా చెప్పాలంటే సినిమాను కొత్తగా తెరకెక్కించినట్లు అనిపించిందది అని శోభు యార్లగడ్డ చెప్పుకొచ్చారు.
