సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్.. ఈ ఏడాది ‘దర్బార్’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు. ఆ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఎందుకో కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. అంతకు ముందు వచ్చిన ‘పేట’ సినిమా కూడా సో సో గానే ఆడింది. అందుకే ఈసారి పక్కా మాస్ సినిమా చేసి అభిమానుల ఆకలి తీర్చాలని.. ‘సిరుతై’ శివ డైరెక్షన్లో సినిమా చెయ్యడానికి రజినీ ఓకే చెప్పారు. ‘అన్నాతై’ పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తెలుగు టైటిల్ ఏంటన్నది ఇంకా ప్రకటించలేదు.
ఇప్పటికే 50శాతం షూటింగ్ పూర్తయ్యింది. వైరస్ మహమ్మారి కారణంగా ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. అయితే ‘ఈ చిత్రం షూటింగ్ పూర్తిగా ఆగిపోయింది’ అంటూ ప్రచారం మొదలైంది. ‘రజినీకి ఈ చిత్రం చెయ్యడం ఇష్టం లేదని చెప్పినట్టు’ కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ‘అన్నాతై’ చిత్ర నిర్మాతలు అయిన ‘సన్ పిక్చర్స్’ వారు ఆ ప్రచారంలో నిజం లేదని తేల్చి చెప్పేశారు. ‘ఇప్పుడు వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో షూటింగ్ ప్రారంభించడం అనేది కరెక్ట్ కాదు.
వ్యాక్సిన్ వచ్చాక.. షూటింగ్ మొదలు పెట్టుకుందాం’ అని రజినీ,శివ లతో కలిసి డిస్కస్ చేసుకున్నాం. ఒక్కసారి పరిస్థితి మొత్తం సెట్ అయిన వెంటనే తిరిగి షూటింగ్ ప్రారంభిస్తాం’ అంటూ నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు.