ఇటీవల ఆస్తిపన్ను వివాదంపై మద్రాస్ హైకోర్టు సూపర్ స్టార్ రజినీకాంత్ పై సీరియస్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఆయన ట్విట్టర్ ద్వారా ఓ పోస్ట్ పెట్టారు. తాను పొరపాటు చేశానని చెప్పారు. వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని రజినీకాంత్ కి రాఘవేంద్ర కల్యాణ మండపం ఉంది. దీనికి ఆరు నెలలకు గానూ రూ.6.50 లక్షల టాక్స్ చెల్లించాలంటూ చెన్నై కార్పొరేషన్ నోటీసులు ఇచ్చింది. దీంతో ఆయన హైకోర్టుని ఆశ్రయించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆస్తి పన్ను చెల్లించానని చెప్పిన ఆయన.. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ కాలానికి ఆరున్నర లక్షలు టాక్స్ చెల్లించమని చెన్నై కార్పొరేషన్ నోటీసులు జారీ చేసిందని పేర్కొన్నారు.
అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారమా మర్చి నుండి కల్యాణ మండపాన్ని మూసివేశామని.. ఆదాయం లేని మండపానికి ఆస్తి పన్ను ఎలా చెల్లిస్తామని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కార్పొరేషన్ ని సంప్రదించినా.. సమాధానం లేకపోవడంతో కోర్టుని ఆశ్రయించినట్లు పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు రజినీకాంత్ కి రివర్స్ అయింది. కార్పొరేషన్ అధికారులు ఆలోచించుకునే సమయం ఇవ్వకుండా.. కోర్టులో పిటిషన్ వేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.
కోర్టు సమయాన్ని వృదుహా చేసినందుకు జరిమానా విధించి పిటిషన్ కొట్టి పారేసింది. ఈ క్రమంలో రజినీకాంత్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. రాఘవేంద్ర కల్యాణ మండపం టాక్స్ విషయంలో మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించకుండా.. చెన్నై కార్పొరేషన్ ని సంప్రదించి ఉంటే.. ఈ పొరపాటు జరిగేది కాదని.. అనుభవమే పాఠం అంటూ ఓ హ్యాష్ ట్యాగ్ ని జత చేశారు.