బ్రిటిష్‌ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ సైట్ అండ్ సౌండ్ మ్యాగజీన్ ఇటీవల టాప్ 25 సినిమాల జాబితాను రిలీజ్ చేసింది. అందులో ప్రముఖ కథానాయకుడు సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) సినిమా చోటు సంపాదించింది అరుదైన ఘనత సాధించింది. రజనీకాంత్ – పా.రంజిత్ (Pa. Ranjith) కాంబినేషన్‌లో వచ్చిన ‘కాలా’ (Kaala) సినిమానే ఆ జాబితాలో చోటు దక్కించుకున్న చిత్రం. దీంతో తలైవా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. 2018లో విడుదలైన యాక్షన్ చిత్రం ‘కాలా’.. బాక్సాఫీసు దగ్గర ఆశించిన విజయాన్ని అందుకోలేదు.
అయితే రజనీ లుక్, నటన, పా.రంజిత్ ఆలోచనలకు మంచి పేరే వచ్చింది. ఉన్నత వర్గాలు, అణగారిన వర్గాల మధ్య జరిగే పోరాటాన్ని సినిమాలో చూపించిన విధానం ప్రేక్షకులను బాగా మెప్పించింది అని చెప్పాలి. ఆ సినిమాకు బ్రిటిష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ సైట్ అండ్ సౌండ్ మ్యాగజైన్ జాబితాలో స్థానం కల్పించారు. 21వ శతాబ్దాపు అద్భుతమైన 25 సినిమాల జాబితాలో ‘కాలా’ కూడా ఒకటి. అంతేకాదు ఈ మ్యాగజైన్‌లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ సినిమా ఇదే కావడం విశేషం.
ప్రపంచవ్యాప్తంగా వేలాది సినిమాలను చూసి, విశ్లేషించి ఈ జాబితాను విడుదల చేశారట. 2000 నుంచి 2024 మధ్య వచ్చిన సినిమాల్లో అన్ని విభాగాల్లోనూ మంచి ప్రదర్శన చూపించిన 25 సినిమాలను ఎంపిక చేశాం. ఒక్కో సంవత్సరం నుండి ఒక్కో సినిమా తీసుకున్నాం అని బ్రిటిష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ సైట్ అండ్ సౌండ్ మ్యాగజైన్ తెలిపింది. ఇక రజనీ కాంత్ కొత్త సినిమాల గురించి చూస్తే.. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వేట్టయాన్’ / ‘వేటగాడు’ అనే సినిమాలో నటిస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ చివరి దశకొచ్చింది. అక్టోబరు 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమా తర్వాత రజనీ.. లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ‘కూలీ’ (Coolie) సినిమా షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. అయితే సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ విషయంలో రజనీ అంత సంతృప్తిగా లేరు అని వార్తలొస్తున్నాయి.