“భలే భలే మగాడివోయ్, మహానుభావుడు” చిత్రాల తరహాలో హీరోకి ఏదైనా విచిత్రమైన రోగం ఉంటే.. అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రం “రాజుగాడు”. రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా రాంగోపాల్ వర్మ శిష్యురాలు సంజానారెడ్డి దర్శకురాలిగా పరిచయమయ్యింది. గత కొంత కాలంగా విడుదలకు ఇబ్బందిపడుతూ ఎట్టకేలకు ఇవాళ (జూన్ 1) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు “రాజుగాడు”. మరి ఆ రాజుగాడి అల్లరి ఆడియన్స్ కు నచ్చిందో లేదో చూద్దాం.
కథ : ప్రాణంగా చూసుకొనే తల్లి (సితార), కంటికి రెప్పలా కాపాడుకొనే తండ్రి (రాజేంద్రప్రసాద్), ఎగువ మధ్యతరగతి లైఫ్ స్టైల్.. ఇలా అన్నీ ఉన్నప్పటికీ ఓ మాయదారి రోగం కారణంగా ఎప్పటికప్పుడు అల్లరిపాలవుతూ తల్లిదండ్రుల్ని టెన్షన్ పెడుతుంటాడు రాజు అలియాస్ రాజుగాడు (రాజ్ తరుణ్). రాజుగాడి అందర్నీ టెన్షన్ పెట్టడానికి, మనోడు టెన్షన్ పడడానికి గల కారణం క్లెప్టోమేనియా. ఈ ఫోబియా వల్ల రాజుగాడు తనకు తెలియకుండానే ఇతరుల పర్సులు, ఫోన్ లు కొట్టేస్తుంటాడు. ఇంటికి వచ్చాక కానీ తెలియదు ఏం కొట్టుకొచ్చాడో. మొదట్లో ఇష్యూ పెద్ద సీరియస్ కాదు కాబట్టి ఎవరూ పట్టించుకోరు. కానీ.. రానురాను ఆ ఫోబియా కారణంగా సమస్యల్లో ఇరుక్కొంటుంటాడు రాజుగాడు.
ముఖ్యంగా తాను ప్రేమించిన అమ్మాయి (అమైరా దస్తూర్)కు తన వీక్ నెస్ తెలియకుండా దాయడం కోసం నానా ఇబ్బందులు పడుతుంటాడు. అయితే.. అమైరా తండ్రి (నాగినీడు) అబద్ధం ఆడినా, తప్పు చేసినా సహించలేడు. ఆ నాగినీడ్ని ఒప్పించడానికి తల్లిదండ్రులతో కలిసి రాజుగాడు చేసిన అల్లరే “రాజుగాడు” చిత్ర కథాంశం.
నటీనటుల పనితీరు : వరుసబెట్టి ఆ తరహా పాత్రలు ఎక్కువగా చేస్తుండడం వల్లనో లేక స్టైలింగ్ ఛేంజ్ చేయకపోవడం వల్లనో తెలియదు కానీ.. రాజ్ తరుణ్ నటన కానీ, లుక్స్ కానీ ఏమాత్రం కొత్తగా కనిపించదు, అనిపించదు. అయితే.. మనోడి కామెడీ టైమింగ్ ఆ మైనస్ పాయింట్స్ ను కవర్ చేసేస్తుంది. రాజేంద్రప్రసాద్ తో కలిసి ఆయనకు పోటీగా రాజ్ తరుణ్ పండించిన కామెడీ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది.
చాలారోజుల తర్వాత రాజేంద్రప్రసాద్ ఫుల్ లెంగ్త్ రోల్ ప్లే చేసిన సినిమా “రాజుగాడు”. భలే నవ్విస్తాడాయన ఈ చిత్రంలో. అసభ్యతకు తావు లేకుండా “అహనా పెళ్లంట” రేంజ్ లో నవ్వించాడు రాజేంద్రుడు. అమైరా అందం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏముంది. చాలారోజులుగా తెలుగులో తనను తాను ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్న అమైరాకు “రాజుగాడు” బాగా కలిసొచ్చాడు. రెగ్యులర్ హీరోయిన్ రోలే అయినప్పటికీ.. తన ప్రెజన్స్ తో ఆకట్టుకొంది.
రాజారవీంద్ర, 30 ఇయర్స్ పృధ్వీ, రఘు కారుమంచు, ప్రవీణ్ లు కడుపుబ్బ నవ్విస్తే.. నాగినీడు, రావురమేష్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు : తొలి చిత్రంతోనే దర్శకురాలిగా తనదైన మార్క్ వేసిన సంజానారెడ్డి గురించి ముందుగా ప్రస్తావించాలి. మొదటి చిత్రంతోనే డజను మంది ఆర్టిస్ట్స్ ను హ్యాండిల్ చేస్తూ వాళ్లందరి చేత సునాయాసంగా కామెడీ పండించిన ఆమె ప్రతిభను మెచ్చుకోవాల్సిందే. అయితే.. మొదటి సినిమా కాబట్టి స్క్రీన్ ప్లే విషయంలో కాస్త తడబడింది. కొన్ని సీన్స్ మరీ ఫార్మాట్ మోడల్ లో ఉన్నాయి. కామెడీ ఎపిసోడ్స్ పక్కన పెడితే కథనం పరంగా సెకండాఫ్ కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లను పక్కన పెడితే.. డైరెక్టర్ గా పర్వాలేదనిపించుకొంది.
గోపీసుందర్ బాణీలు కొత్తగా లేకపోయినా బి.రాజశేఖర్ ఆ పాటను పిక్చరైజ్ చేసిన విధానం డిఫరెంట్ గా, కలర్ ఫుల్ గా ఉండడంతో పాటలు బాగానే ఎక్కేస్తాయి. రాజశేఖర్ సినిమాటోగ్రఫీ సినిమాకి మంచి వేల్యూ యాడ్ చేసింది. కొత్తగా ఏమీ ఉండదు కానీ.. రిచ్ గా ఉంటుంది.
సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో నిర్మాత అనిల్ సుంకర చెప్పినట్లుగా.. “రాజుగాడు” అదరగొట్టే సినిమా కాదు, ఆద్యంతం కడుపుబ్బ నవ్వించే సినిమా. అయితే.. ఆ కామెడీ అందరికీ రుచించకపోవచ్చు. బి, సి సెంటర్ ఆడియన్స్ మాత్రం విపరీతంగా ఎంజాయ్ చేస్తారు.
కథ, కథనం “మహానుభావుడు” చిత్రాన్ని మహాబాగా గుర్తుకుతెచ్చినప్పటికీ.. రాజేంద్రప్రసాద్ కామెడీ టైమింగ్ ఆ విషయాన్ని మరిపిస్తుంది. ఆయన లేకపోతే ఈ సినిమా రిజల్ట్ ఇంకోలా ఉండేదేమో.
విశ్లేషణ : కొత్తదనం అనేది ఆశించకుండా కాసేపు హ్యాపీగా నవ్వుకోవడం కోసం సరదాగా ఒకసారి చూడదగ్గ చిత్రం “రాజుగాడు”. అద్భుతంగా ఉండకపోయినా.. రెండు గంటలపాటు అలరించే విధంగా ఉన్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా హల్ చల్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
రేటింగ్ : 2/5