జబర్దస్త్ షో ద్వారా కమెడియన్ గా ప్రపంచానికి పరిచయమైన గెటప్ శ్రీను (Getup Sreenu) .. నటుడిగా తన సత్తాను ఆ స్టేజ్ మీదే పలుమార్లు ఘనంగా చాటుకున్నాడు. అనంతరం కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ ప్లే చేస్తూ వచ్చాడు. రీసెంట్ గా వచ్చిన “హనుమాన్” (Hanu Man) సినిమాలో సపోర్టింగ్ రోల్ ప్లే చేసి తనకంటూ సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి “రాజు యాదవ్”గా (Raju Yadav) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమాతో గెటప్ శ్రీను హీరోగా నిలదొక్కుకోగలిగాడా? లేదా? అనేది చూద్దాం..!!
కథ: ఒక క్రికెట్ మ్యాచ్ ఆడుతుండగా.. బాల్ తగలడంతో రాజు యాదవ్ (గెటప్ శ్రీను) దవడ నవ్వుతున్న పొజిషన్ లో స్ట్రక్ అయిపోతుంది. నవ్వు ముఖం మంచిదే అయినా.. సందర్భంతో పని లేకుండా ఎక్కడ చూసినా నవ్వుతున్నట్లుగా కనిపించే రాజు యాదవ్ ను చుట్టూ ఉన్నవాళ్లందరూ తిట్టుకొంటుంటారు. అదే తరుణంలో రాజులో ఉన్న అవలక్షణాన్ని పాజిటివ్ గా చూసే స్వీటీ (అంకిత (Ankitha Kharat)) అతడి జీవితంలోకి ఎంట్రీ ఇస్తుంది. స్వీటీ ఎంట్రీ తర్వాత రాజు జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? అనేది “రాజు యాదవ్” సినిమా కథాంశం.
నటీనటుల పనితీరు: నటుడిగా గెటప్ శ్రీను ప్రతిభ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి పాత్రలోనైనా, ఎలాంటి బాడీ లాంగ్వేజ్ అయినా అలవోకగా ఆకళింపు చేసుకుని పాత్రలో జీవించేస్తాడు శ్రీను. అయితే.. ఎమోషనల్ సీన్స్ లో మాత్రం తన నటనతో అలరించలేకపోయాడు శ్రీను. ముఖ్యంగా ఫైట్ సీన్ లో శ్రీను నటన కాస్త అతిగా ఉంటుంది.
అంకిత గ్లామర్ యాడ్ చేసింది కానీ.. నటిగా మాత్రం కనీస స్థాయిలో కూడా ఆకట్టుకోలేకపోయింది. నిజానికి చాలా షేడ్స్ ఉన్న క్యారెక్టర్. ఇలా ముంబై మోడల్ ను కాకుండా.. నటించడం తెలిసిన ఒక తెలుగు నటిని తీసుకొని ఉంటే స్వీటీ పాత్ర మరింతగా కనెక్ట్ అయ్యేది. తండ్రిగా ఆనంద చక్రపాణి (Ananda Chakrapani) పర్వాలేదనిపించుకున్నాడు. జబర్దస్త్ సన్నీ (Jabardasth Sunny), మిర్చి హేమంత్ తదితరులు నవ్వించే ప్రయత్నం చేసారు.
సాంకేతికవర్గం పనితీరు: హర్షవర్ధన్ రామేశ్వర్ (Harshvardhan Rameshwar) & సురేష్ బొబ్బిలి అందించిన బాణీలు, నేపథ్య సంగీతం బాగున్నాయి. సాయిరాం సినిమాటోగ్రఫీ వర్క్ సోసోగా ఉంది. కాకపోతే.. ఇచ్చిన బడ్జెట్ లో బెటర్ అవుట్ పుట్ ఇచ్చాడనే చెప్పాలి. ప్రొడక్షన్ డిజైన్, డి.ఐ, కలరింగ్ తదితర టెక్నికాలటీస్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
దర్శకుడు కృష్ణమాచారి ఎంచుకున్న పాయింట్ మంచిదే. రీసెంట్ గా వచ్చిన “బేబీ” (Baby) రిజల్ట్ బట్టి.. ఈ పాయింట్ కు కూడా మంచి రిసెప్షన్ వచ్చేది. కానీ.. కీలకపాత్రధారి అయిన అంకిత క్యారెక్టర్ ను ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా చేయలేకపోవడంతో రెగ్యులర్ ఫెయిల్యూర్ లవ్ స్టోరీగా ఈ చిత్రం మిగిలిపోయింది. గెటప్ శ్రీను మంచి నటుడు అని ప్రత్యేకంగా ప్రూవ్ చేయడం కోసం ఇరికించిన సన్నివేశాల మీద పెట్టిన శ్రద్ధలో సగం..
కథనం మీద పెట్టి ఉంటే సినిమా కచ్చితంగా ఒక వర్గం ప్రేక్షకులకైనా కనెక్ట్ అయ్యేది. రెండూ లోపించడంతో “రాజు యాదవ్” సినిమాగా ప్రేక్షకుల్ని అలరించలేకపోయింది. దర్శకుడిగా, రచయితగా కృష్ణమాచారి విఫలమయ్యాడు.
విశ్లేషణ: విఫల ప్రేమకథలు ప్రేక్షకులకు కొత్త కాదు. ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా పాత్రలు తీర్చిదిద్దగలిగితే.. సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమని ఈమధ్యకాలంలో వచ్చిన చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. అయితే.. “రాజు యాదవ్”లో గెటప్ శ్రీను నటప్రాభవం మినహా.. ఆకట్టుకునే అంశం ఒక్కటి కూడా లేకపోవడంతో సినిమా చతికిలపడింది.
ఫోకస్ పాయింట్: రాజుగాడి వ్యధ మహా కష్టమబ్బా!
రేటింగ్: 1.5/5