ఇండస్ట్రీ కళ్లు గప్పి ఒక భారీ పనిని సైలెంట్ గా పూర్తి చేశారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం అందరి దృష్టీ ‘పెద్ది’ షూటింగ్ మీదే ఉంది. కానీ చరణ్ మాత్రం ఆ గ్యాప్ లోనే తన తర్వాతి ప్రాజెక్ట్ కి సంబంధించిన అత్యంత కీలకమైన పనిని చక్కబెట్టేసుకున్నారు. ఎవరికీ తెలియకుండా దుబాయ్ వెళ్ళడం, అక్కడ దర్శకుడు సుకుమార్ తో భేటీ అవ్వడం చకచకా జరిగిపోయాయి. బయట హడావిడి లేకుండా జరిగిన ఈ సీక్రెట్ మీటింగ్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో ఆసక్తి రేపుతోంది.
RC17
అసలు సుకుమార్ తన టీమ్ తో దుబాయ్ లో ఎందుకు మకాం వేశారంటే.. హైదరాబాద్ లో ఉంటే వచ్చే డిస్టర్బెన్స్ లు అక్కడ ఉండవు. పూర్తి ఏకాగ్రతతో స్క్రిప్ట్ ను ఫైనల్ చేయొచ్చు. అందుకే సుక్కూ అక్కడికి వెళ్లారు, చరణ్ కూడా అక్కడికే వెళ్లి కథను ఫైనల్ చేశారు. ‘రంగస్థలం’ తర్వాత వస్తున్న కాంబినేషన్ కాబట్టి అంచనాలు ఎలా ఉంటాయో వీరికి బాగా తెలుసు. అందుకే ఆ అంచనాలను దాటేలా, ఒక పర్ఫెక్ట్ బ్లాక్ బస్టర్ స్క్రిప్ట్ ను ఈ దుబాయ్ ట్రిప్ లో లాక్ చేసుకున్నారట.
ఈసారి వీరి టార్గెట్ లోకల్ కాదు, గ్లోబల్. కథ పరిధిని పాన్ ఇండియా దాటించి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ప్లాన్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు సుకుమార్ సొంత బ్యానర్ కూడా నిర్మాణంలో ఉండటం విశేషం. ఇక గ్లామర్ టచ్ కోసం బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ పేరును పరిశీలిస్తున్నారట. దీన్ని బట్టి చూస్తే కాస్టింగ్ దగ్గరి నుంచి మేకింగ్ వరకు ప్రతీది గ్రాండ్ గా ఉండేలా ప్లాన్ చేశారని అర్థమవుతోంది.
అయితే ఫ్యాన్స్ ఈ కాంబో కోసం 2026 వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం చరణ్ ‘పెద్ది’ సినిమాతో బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న ఆ సినిమా వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ కానుంది. అది పూర్తయిన వెంటనే, ఏమాత్రం గ్యాప్ లేకుండా సుకుమార్ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. ఈ లోపు సుకుమార్ ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసి రెడీగా ఉంటారు.