తొలిసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి రెండు స్థానాల్లో ఓటమిపాలయ్యాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) . అయతే రెండోసారి తనను గెలిపించింది పిఠాపురం. తనను తొలిసారి గెలిపించిన పిఠాపురాన్ని అభివృద్ధి చేసేలా చాలా హామీలు ఇచ్చారు. అందులో ఒకటి మెగా హాస్పిటల్. దీనికి సంబంధించిన పనులు ఇప్పుడు మొదలయ్యాయి అని తెలుస్తోంది. ఈ మేరకు చిరంజీవి (Chiranjeevi) కుటుంబసభ్యులు అడుగులు వేశారు అని చెబుతున్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు, చేబ్రోలు మధ్య పది ఎకరాల స్థలాన్ని రామ్ చరణ్ (Ram Charan) కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ఆ స్థలంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కడతారు అనే చర్చ జరుగుతోంది. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ జనరల్ మేనేజర్ రవణం స్వామి నాయుడు ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. అపోలో ఆధ్వర్యంలో ఈ ఆసుపత్రి ఏర్పాటు ఉంటుంది అని సమాచారం. పిఠాపురంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా నియోజకవర్గంలో ఓ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేయిస్తానని మాటిచ్చారు.
రామ్ చరణ్‌తో మాట్లాడి అపోలో ఆస్పత్రిని ఏర్పాటు చేస్తానని, ఇక్కడి ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు దానిని నెరవేర్చే క్రమంలోనే ఈ స్థలం కొనుగోలు, ఏర్పాట్లు అని తెలుస్తోంది. అపోలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి మాత్రమే కాకుండా నియోజకవర్గానికి అవసరమైన పనులను చేపట్టడానికి సొంత నిధులను వెచ్చించడానికి మెగా కుటుంబం సిద్ధంగా ఉందని సమాచారం.
మరోవైపు ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గం.. ఆయన ఆశించినట్టు దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా మారబోతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక పవన్ సినిమాల సంగతి చూస్తే.. ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్ రీసెంట్‌గా పునర్ ప్రారంభమైంది. త్వరలో పవన్ సెట్స్‌లో అడుగుపెడతారు అని చెబుతున్నారు. ఆ తర్వాత ‘ఓజీ’ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది అని చెబుతున్నారు.