ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ.. బుధవారం (అక్టోబర్ 26)న తాడేపల్లిలో భేటీ అయ్యారు. అందులో ఏముంది, ఏదో పని ఉండి ఉంటుంది అందుకే కలిశారు అని అనుకోవచ్చు. అయితే వైఎస్‌ఆర్‌సీపీ నుండి వేరే సంకేతాలు బయటికొస్తున్నాయి. దీంతో ‘ఏం జరుగుతోంది’? అంటూ ఓ చర్చ ఇటు టాలీవుడ్‌లో, అటు ఏపీ రాజకీయాల్లో మొదలైంది. మామూలుగా వైఎస్ జగన్‌ను వేరే దర్శకుడు కలిస్తే ఇంత చర్చ జరిగేది కాదు కానీ కాంట్రవర్సీ కింగ్ వర్మ కాబట్టే ఇదంతా..
ఏమైందా అని ఆరా తీస్తే.. వర్మ నుండి త్వరలో ఓ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ సినిమా రానుందని.. రాజకీయ నేపథ్యంలో వర్మ తీయబోయే ఓ సినిమా గురించి వైఎస్ జగన్‌తో చర్చించినట్లు సమాచారం. తాజా రాజకీయ పరిణామలపై అక్కడ చర్చ జరిగినట్టు తెలుస్తోంది. సీఎంని కలిశాక వర్మ మీడియాకు కనిపించకుండా వెళ్లిపోవడం, ఈ మీటింగ్‌పై సీఎం కార్యాలయం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో రకరకాల వార్తలు వినిపించాయి. కట్ చేస్తే, తన ట్వీట్‌తో పొలిటికల్ సినిమా అనౌన్స్ చేశాడు కాంట్రవర్సీ కింగ్..
‘‘నేను అతి త్వరలో “వ్యూహం” అనే రాజకీయ సినిమా తియ్యబోతున్నాను ..ఇది బయోపిక్ కాదు…బయో పిక్ కన్నా లోతైన రియల్ పిక్. బయో పిక్‌లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ , రియల్ పిక్‌లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయి’’.. ఈ చిత్రం 2 పార్ట్స్ గా రాబోతుంది .. మొదటి పార్ట్ “వ్యూహం”, 2nd పార్ట్ “శపథం”.. రెండింటిలోనూ రాజకీయ అరాచకీయాలు పుష్కలంగా వుంటాయి. రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం “వ్యూహం“ షాక్ నుంచి తెరుకునేలోపే వాళ్ళకి ఇంకో ఎలెక్ట్రిక్ షాక్, పార్ట్ 2 “శపథం“ లో తగులుతుంది. అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశాడు.
అధికార పార్టీకి అనుకూలంగా.. ప్రతిపక్ష పార్టీకి మరియు ఆ పార్టీతో సత్సంబంధాలు కలిగిన మరో పార్టీకి వ్యతిరేకంగా వర్మ పొలిటికల్ మూవీ ఉండబోతుందని తెలుస్తోంది. బయోపిక్స్ తియ్యడంలో వర్మ సిద్ధహస్తుడన్న విషయం కొత్తగా చెప్పక్కర్లేదు. ఆయన తెరకెక్కించిన బయోపిక్స్ చాలా వరకు సక్సెస్ అయ్యాయి. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తర్వాత రాజకీయాల ఆధారంగా వర్మ చేయబోతున్న సినిమా ఇదే. దీంతో మరోసారి ఫిలిం అండ్ పొలిటికల్ సర్కిల్స్‌లో వర్మ వార్తల్లో నిలిచాడు. త్వరలో ఈ సినిమాలకి సంబంధించి మరిన్ని విషయాలు తెలియనున్నాయి.