హారర్ సినిమాతో రామ్ గోపాల్ వర్మ రెడీ!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో సినిమాలను డైరెక్ట్ చేయడం మానేశాడు. తన దగ్గర అసిస్టెంట్లుగా పని చేస్తోన్న అగస్త్య మంజు, సిద్దార్ధ తాతోలు, ఆనంద్ చంద్ర లాంటి కొత్త కుర్రాళ్లతో సినిమా తీయించి రిలీజ్ చేస్తున్నాడు. ఈ సినిమాల్లో క్వాలిటీ లేక.. కథలు జనాలను మెప్పించలేక ఫెయిల్ అవుతున్నాయి. వర్మ చివరిగా డైరెక్ట్ చేసిన సినిమా అంటే అది నాగార్జున నటించిన ‘ఆఫీసర్’ అనే చెప్పాలి. ఈ సినిమా కూడా డిజాస్టర్ అయింది. దీని తరువాత కూడా వర్మ మారలేదు.

మరింత నాసిరకం, బూతు సినిమాలే తీస్తూ వచ్చాడు. ప్రస్తుతం ఆయన సీరియస్ గా ఓ ఫుల్ లెంగ్త్ ఫీచర్ ఫిలిం చేశాడు. ఆ సినిమానే ’12 ఓ క్లాక్’. మూడేళ్ల క్రితం ‘సర్కార్’ తీశాక మళ్లీ బాలీవుడ్ లో ఇప్పటివరకు సినిమా తీయలేదు వర్మ. ఇన్నాళ్లకు ఓ హారర్ కథను డైరెక్ట్ చేశాడు వర్మ. మిథున్ చ‌క్ర‌వ‌ర్తి, మార్కండ్ దేశ్ పాండే, ఆశా సైని త‌దిత‌రులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అప్పట్లో ‘రాత్’, ‘భూత్’ లాంటి సినిమాలను డైరెక్ట్ చేసిన వర్మ ఇప్పుడు మరోసారి తన హారర్ సినిమాతో భయపెట్టడానికి రెడీ అవుతున్నాడు.

అయితే అప్పట్లో హారర్ కథలంటే కొత్తగా ఉండేవి. కానీ ఇప్పుడు కూడా అదే స్టైల్ లో ’12 ఓ క్లాక్’ సినిమా తీశాడని ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. విజువల్స్ పెద్దగా ఆకట్టుకోనప్పటికీ కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను మెప్పించింది. కొత్త ఏడాదిలో జనవరి 8న సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నాడు వర్మ.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus