వెంకటేష్ తన మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి రెండు సినిమాల్లో నటించాడు. ఒకటి ‘ప్రేమమ్'(గెస్ట్ రోల్) కాగా మరొకటి ‘వెంకీమామ’. ఈ రెండు చిత్రాలు కూడా మంచి విజయాలనే సొంతం చేసుకున్నాయి. వీటితో అక్కినేని, దగ్గుబాటి.. అభిమానుల కోరిక తీరింది. అయితే వెంకటేష్ తన అన్నయ్య కొడుకు రానాతో కలిసి ఎప్పుడు సినిమా చేస్తాడు? అనే ప్రశ్న ఇంకా అందరిలోనూ ఉంది. ఈ ప్రాజెక్టు ఎప్పుడెప్పుడు మొదలవుతుందా.. అని వీరిద్దరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ విషయం పై తాజాగా రానా క్లారిటీ ఇచ్చేసాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రానా మాట్లాడుతూ.. ‘చిన్నాన్న నేను కలిసి త్వరలోనే సినిమా చేయబోతున్నాం.ఎప్పటి నుండో మేమిద్దరం కలిసి సినిమా చెయ్యాలని.. మంచి స్క్రిప్ట్ కోసం వెయిట్ చేసాము. అది ఈ లాక్డౌన్ టైములో దొరికింది.మా ఇద్దరికీ ఆ స్క్రిప్ట్ బాగా నచ్చింది’ అంటూ రానా చెప్పుకొచ్చాడు. కానీ ఈ ప్రాజెక్ట్ ఎవరు డైరెక్ట్ చేస్తారు.. ఎవరు నిర్మిస్తారు వంటి విషయాలను అయితే రానా బయటపెట్టలేదు.
అయితే.. రానా తండ్రి సురేష్ బాబు ఈ ప్రాజెక్టుని నిర్మించే అవకాశాలు ఉన్నట్టు ఇన్సైడ్ టాక్. గతంలో వచ్చిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమాలో ‘బళ్లారి బావ’ పాటకు వీరిద్దరూ కలిసి స్టెప్పులేసిన సంగతి తెలిసిందే.