వారసులుగా సినిమా రంగంలోకి రావడం సులభమే కానీ.. ఆ తర్వాత తమ పెద్దల పేరు నిలబెట్టేందుకు చాలా తిప్పలు పడాల్సి ఉంటుంది. అందరూ అనుకునేట్లుగా తమ జీవితాలేమీ పూల పాన్పులు కాదని అంటున్నారు రానా దగ్గుబాటి. బాహుబలిలో భల్లాలదేవుడి పాత్రకు జీవం పోసిన రానా, తన జీవితంలో చాలా సీరియస్ సమస్యల్ని ఎదుర్కొన్నారట. సమంత హోస్ట్ చేస్తున్న సామ్ జామ్ అనే టాక్ షో లో పాల్గొన్న సందర్భంగా రానా తన ఆవేదనను, సమస్యను గురించి ప్రపంచానికి వెల్లడించారు. రానాకు ఒక కన్ను కనబడదు. కేవలం ఒక కంటితోనే ఆయన చూడగలరు. ఇది ఆయనకు ఎప్పటి నుంచో ఉన్న సమస్య. కాగా.. ఇటీవల ఆయన అరణ్య సినిమా షూటింగ్ కోసం థాయ్ ల్యాండ్ అడవులకు వెళ్లారు.
అక్కడ షాట్ కు ముందు రానా కళ్లకు కాంటాక్ట్స్ లెన్స్ వేరేవి వాడాలని దర్శకుడు చెప్పారట. అయితే.. రానా కళ్లకు అవి పెట్టాలంటే చిన్న సర్జరీ చేయాల్సి ఉంటుందట. దీంతో.. ఆ సర్జరీ చేయించుకుని.. ఓ పది రోజుల పాటు రెస్ట్ తీసుకుని ఆ తర్వాత షూటింగ్ కు వెళ్దామని రానా భావించారట. ఈ క్రమంలో ఆస్పత్రికి వెళ్తే.. సర్జరీకి ముందు బీపీ పరీక్షలు చేసిన వైద్యులు, మీకు అంతా బాగానే ఉంటుందా అని అడిగారట. ఆరోగ్యంగానే ఉన్నానని రానా చెప్పినా.. మళ్లీ మళ్లీ అదే ప్రశ్న అడిగారట. మరోసారి అన్ని రకాల టెస్టులు చేశారట. రానా బీపీ సాధారణ మనిషి కంటే రెండు రెట్లు అధికంగా ఉందని ఆ పరీక్షల్లో తేలిందట. దీంతో ఎందుకైనా మంచిదని తన తండ్రి సురేశ్ బాబుతో కలిసి రానా అమెరికా వెళ్లారట.
అక్కడ ఉన్న మయో అనే క్లినిక్ లో అన్ని టెస్టులు చేయించిన మీదట, రానాకు పుట్టుకతోనే రక్తపోటు ఉందని తేలింది. దాని వల్ల రానా శరీరంలో అవయవాలు దెబ్బతినడమే కాక, గుండె చుట్టూ కాల్షియం పేరుకుపోయిందని వైద్యులు ఆయనకు చెప్పారట. వెంటనే సర్జరీ చేయించుకోకపోతే.. గుండెపోటు వచ్చేందుకు 70శాతం అవకాశం, 30 శాతం చనిపోయేందుకు కూడా అవకాశం ఉందని హెచ్చరించారట. అంతేకాక.. మందు, మాంసం, ఉప్పు, సిగరెట్ ఇవన్నీ వెంటనే మానేయాలని వైద్యులు స్పష్టం చేయడంతో వాటన్నింటికీ రానా దూరమైపోయారు. చాలా తక్కువ ఆహారం తీసుకోవడంతో పాటు.. సర్జరీ కూడా చేయించుకున్నారు. అనంతరం.. తిరిగి ప్రస్తుతమున్న స్థితికి చేరుకునేందుకు తాను పడిన కష్టం అంతా ఇంతా కాదని రానా వెల్లడించారు. తన జీవితంలో ఎదుర్కొన్న ఈ మొత్తం బాధ గురించి త్వరలోనే ఒక షార్ట్ ఫిల్మ్ ను రానా విడుదల చేయనుండటం గమనార్హం.