మహేష్ బాబు వల్ల రానా రూ.100 కోట్లు పోగొట్టుకోవడం ఏంటి? పైన హెడ్డింగ్ చూసిన వెంటనే అందరి మైండ్లో మెదిలే ప్రశ్న ఇదే. అది ఎందుకో తెలుసుకోవాలంటే మనం 2004 కి వెళ్ళాలి. ఆ టైంలో ‘గజిని’ అనే కథను రెడీ చేసుకుని హీరో కోసం వెతుకులాట మొదలుపెట్టాడు మురుగదాస్. ఆ టైంలో రానా ఇంకా హీరోగా ఎంట్రీ ఇవ్వలేదు. తన తండ్రి నిర్మించే సినిమాల కథల డిస్కషన్ల విషయంలో చురుగ్గా పాల్గొనేవాడు. అదే టైంలో ఒకసారి చెన్నై నుండి సురేష్ బాబుని కలవడానికి మురుగదాస్ వచ్చారు.
ఆయన ‘గజిని’ కథని వినిపించడానికి తెలుగు రాష్ట్రాల్లో అడుగుపెట్టాడు. సురేష్ బాబు- రానా లు ఈ కథ విన్నారు. వాళ్ళకి కథ బాగా నచ్చింది. కానీ వెంటనే సురేష్ బాబు ‘ఈ కథ చేయడానికి టాలీవుడ్ హీరోలు ఇంట్రెస్ట్ చూపించరు.. కానీ చేస్తే చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది’ అని మొహమాటం లేకుండా చెప్పేసాడట. అయితే రానా .. మహేష్ అయితే ఇలాంటి ప్రయోగాలకు ఇంట్రెస్ట్ చూపిస్తాడు అని చెప్పాడట. అప్పటికి మహేష్ ‘అతడు’ ‘పోకిరి’ వంటివి చేయలేదు. పైగా ‘నిజం’ ‘నాని’ వంటి ప్రయోగాత్మక చిత్రాలు చేశాడు.
అందుకే రానా… మహేష్ ను కలిసి ‘గజిని’ కథ గురించి వివరించాడు. మహేష్ కూడా ఇలాంటి కథలు తెలుగు ప్రేక్షకులకు నచ్చవు.. చేస్తే వేరే భాషలోని హీరోనే చేయాలి అని చెప్పేశాడట. దీంతో ‘గజిని’ రైట్స్ ను కొనుగోలు చేసుకోవాలి అనే ఆలోచన రానా విరమించుకున్నాడు. మురుగదాస్ తర్వాత పవన్ కళ్యాణ్ ను కూడా కలిసి ఈ కథను వినిపించాడు. పవన్ కూడా ఈ కథ చేయడానికి ఇష్టపడలేదు. తమిళంలో కూడా విక్రమ్ తప్ప ఈ కథను చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు.
ఓ రోజు యువ సినిమా చూసినప్పుడు ఈ కథ సూర్యతో చేస్తే బాగుంటుంది అనే ఆలోచన మురుగదాస్ కు వచ్చింది. కథ వినిపించగానే అతను కూడా ఓకే అన్నాడు. ఈ సినిమా అతనితో చేయడం తమిళంలో సూపర్ హిట్ అవ్వడం.. వెంటనే తెలుగు రైట్స్ ను అల్లు అరవింద్ కొనుక్కుని రిలీజ్ చేయగా అది సూపర్ హిట్ అయ్యింది. తర్వాత అదే సినిమాని ఆమిర్ ఖాన్ తో హిందీలో రీమేక్ చేయగా అక్కడ కూడా ఈ మూవీ రూ.100 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది.