రాజమౌళి కలల చిత్రం ‘బాహుబలి’. ఇది సగం సాకారం కాగా మరో సగం ఆకారం దిద్దుకుంటోంది. రాజమౌళి కల సాకారమవడం అటుంచితే.. ఈయన కల మూలాన మరికొంతమంది కళ్ళు కాయలు గట్టేస్తున్నాయి. నటీనటులను ఏళ్లకు ఏళ్ళు తన ఆధీనంలోనే బంధించేసి కొంతమంది దర్శకులకు పనిలేకుండా చేశేశారు.
అటు నటీనటులు కూడా ఈ విషయాలతో పాటు వ్యక్తిగత జీవితాన్ని గాలికొదిలేసి ‘జక్కన్న’ కలకు కట్టు బానిసగా మారిపోయారు. తాజాగా జక్కన్న చెర నుండి భళ్లాలదేవుడు బయటపడ్డాడన్న వార్త అంతటా హల్చల్ చేస్తోంది. బాహుబలి-ది కంక్లూజన్ పతాక సన్నివేశాల చిత్రీకరణ పూర్తయినట్టు, వెను వెంటనే రానా తన తర్వాతి సినిమాలను పట్టాలెక్కించనున్నాడని ప్రచారం ఊపందుకుంది.
దీనిపై నిర్మాత శోభు యార్లగడ్డ స్పందిస్తూ “ఇంకా రానా పార్ట్ కొంత చిత్రీకరణ మిగిలి ఉందని, మేమూ అతణ్ణి త్వరగా పంపించేయాలనుకుంటున్నాం” అంటూ సరదాగా అన్నారు. దీంతో ఈ తప్పుడు ప్రచారానికి తెర పడింది.