దగ్గుబాటి రానాని బాహుబలి అంతర్జాతీయ సినీ ప్రపంచానికి పరిచయం చేసింది. అతనితో సినిమా చేయడానికి నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. ఈ జాబితాలో టాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాదు హాలీవుడ్ నిర్మాతలు ఉండడం విశేషం. రానా కటౌట్, వాయిస్, నటన నచ్చి లండన్ కి చెందిన ఓ ప్రొడక్షన్ హౌస్ తమ ప్రాజక్ట్ కి హీరోగా రానాని తీసుకుంది. లండన్ డిజిటల్ మూవీ అండ్ టీవీ స్టూడియోస్, ఎల్ డీఎమ్ తో కలిసి ఓ రియల్ బేస్డ్ సంఘటనతో సినిమాను తెరకెక్కించనుంది. విజిల్ అనే భారీ నౌక 1888 నవంబర్ లో దాదాపు 700 మంది ప్రయాణికులతో సహా కనిపించకుండా పోయింది.
ఈ లైన్ తో సినిమాను రూపొందించనున్నారు. రానా ఆ నౌకను కనుగొనేందుకు సహకరించే శాస్త్రవేత్తగా నటించనున్నారు. దాదాపు ఇలాంటి కథతో వచ్చిన ఘాజీలో రానా చక్కగా నటించి ఆకట్టుకున్నారు. ఈ రోల్ ని కూడా అద్బుతంగా పోషిస్తారని అందరూ ఆశిస్తున్నారు. హాలీవుడ్ ఎంట్రీకి రానా మంచి కథను ఎంచుకున్నారని పలువురు సినీ ప్రముఖులు అభినందిస్తున్నారు. ద్వానిల్ మెహతా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు విజిల్ : మిస్టరీ ఆఫ్ ది ఫాంటమ్ షిప్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా 2018లో సెట్స్ మీదకు వెళ్లనుంది.