రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!

“భీష్మ” లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం “చెక్”తో డిజాస్టర్ అందుకున్న అనంతరం నితిన్ హీరోగా విడుదలవుతున్న సినిమా “రంగ్ దే”. “తొలిప్రేమ”తో దర్శకుడిగా అశేష ప్రేక్షకలోకాన్ని ఆకట్టుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తిసురేష్ కథానాయిక. విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ప్రేక్షకుల్ని అలరించాయి. మరి సినిమా ఆ స్థాయిలో ఆకట్టుకోగలిగిందో లేదో చూద్దాం..!!

కథ: చిన్నప్పట్నుంచి పక్కపక్క ఇళ్ళల్లోనే కలిసి పెరుగుతారు అను (కీర్తిసురేష్) & అర్జున్ (నితిన్). అప్పటివరకూ తనకు ఇంట్లో & కాలనీలో లభించిన అటెన్షన్ మొత్తం అను కొట్టేసిందని జెలసీ ఫీల్ అవుతూ ఉంటాడు అర్జున్. అర్జున్ జెలసీని ప్రేమలా భావిస్తూ సంతోషపడిపోతూ ఉంటుంది అను. ఒకానొక సందర్భంలో ఇష్టం లేకపోయినా అనును పెళ్లి చేసుకుంటాడు అర్జున్. చదువుకోవడానికి దుబాయ్ వెళ్తారు.

అప్పటివరకూ స్నేహితుల్లా ఉండి తిట్టుకుంటూ వచ్చిన అను-అర్జున్ దుబాయ్ వెళ్ళాక భార్యాభర్తల్లా కొట్టుకోవడం మొదలెడతారు. ఈ క్రమంలో అనుకోని విధంగా అను గర్భవతి అవుతుంది. స్నేహితుల నుంచి భార్యాభర్తలయ్యాక కూడా స్పర్ధలతో తిట్టుకుంటూ బ్రతికేసిన అను-అర్జున్ లు తల్లిదండ్రులు కాబోతున్నారు అని తెలిసిన తర్వాతైనా మనస్ఫూర్తిగా కలిశారా? లేదా? అనేది “రంగ్ దే” కథాంశం.

నటీనటుల పనితీరు: చాలా సినిమాల తర్వాత నితిన్ కాస్త కొత్తగా కనిపించాడు. అలాగే కాలేజ్ స్టూడెంట్ గా, భర్తగా, తండ్రిగా చక్కని ఎమోషన్స్ పండించాడు. కీర్తిసురేష్ పక్కన స్క్రీన్ ప్రెజన్స్ తో సర్వైవ్ అవ్వడం అనేది చాలా పెద్ద విషయం. కానీ.. నితిన్ సక్సెస్ అయ్యాడు. అంతేకాక.. కీర్తితో సమానమైన పెర్ఫార్మెన్స్ ప్రదర్శించాడు. కీర్తిసురేష్ పాత్ర సినిమాకి మూలం. ఆమె సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసింది. అందంగా, పద్ధతిగా కనిపించడమే కాక ఎమోషన్స్ ను ఎంతో హుందాగా పండించి ఆకట్టుకుంది. కీర్తి-నితిన్ ల కాంబినేషన్ కొత్తగా ఉండడమే కాక కెమిస్ట్రీ కూడా బాగా పండింది. ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ పాయింట్ & ఎమోషనల్ ఫైట్ బాగా వర్కవుట్ అయ్యింది.

అభినవ్, సుహాస్, బ్రహ్మాజీ వంటి కామెడీ ఆర్టిస్ట్స్ ఉన్నప్పటికీ.. నరేష్ వాళ్లందరి మీద పైచేయి ప్రదర్శించారు. అలాగే వెన్నెల కిషోర్ కామెడీ కూడా ఒన్నాఫ్ ది హైలైట్ అని చెప్పొచ్చు. సింగిల్ డైలాగ్స్ ఆడియన్స్ ను హిలేరియస్ గా నవ్విస్తాయి. రోహిణి క్యారెక్టర్ ప్రతి ఇంట్లోని సగటు తల్లికి కనెక్ట్ అవుతుంది.

సాంకేతికవర్గం పనితీరు: పి.సి.శ్రీరామ్ మ్యాజిక్ మొదటిసారి మిస్ అయ్యింది. ఆయన స్థాయి యాంగిల్స్ కానీ ఫ్రేమ్స్ కానీ కనిపించలేదు. అలాగే.. పి.సి.శ్రీరామ్ స్పెషాలిటీ అయిన ఎల్లో టింట్ మిస్ అవ్వడం అనేది ఆయన కెమెరా వర్క్ ఫ్యాన్స్ నిరాశపడే అంశం. అయితే.. కీర్తి-నితిన్ ల కెమిస్ట్రీ & ఇంటిమేట్ సీన్స్ ను మాత్రం చాలా సింప్లిఫైడ్ గా తెరకెక్కించారు పి.సి. దేవిశ్రీప్రసాద్ కాస్త తన మూస నుంచి బయటకు వచ్చి మొదటిసారి ఒక నాన్-సుకుమార్ సినిమాకి మంచి నేపధ్య సంగీతం, పాటలు అందించారు. పాటల ప్లేస్ మెంట్ కూడా బాగుంది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రీక్లైమాక్స్ లో వచ్చే సిడ్ శ్రీరామ్ పాడిన “నా కనులు ఎపుడూ” పాట ప్లేస్ మెంట్, లిరిక్స్ & ఎమోషన్స్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయి.

దర్శకుడు వెంకీ అట్లూరి రాసుకున్న కథ కొత్తది కాదు కానీ.. ఎమోషన్స్ మాత్రం కొత్తగా పండించాడు. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు హ్యాండిల్ చేసిన విధానం ప్రశంసనీయం. కాన్ఫ్లిక్ట్ పాయింట్ ను మరీ ఎక్కువగా సాగదీయకుండా సింపుల్ గా ముగించిన విధానం ఆడియన్స్ కు నచ్చుతుంది. అయితే.. ఫస్టాఫ్ “ఆనందం, సొంతం” సినిమాలను గుర్తుచేస్తుంది. కామెడీ సీన్స్ బాగా రాసుకున్నాడు. మంచి టెక్నీషియన్స్ దొరికితే ఒక సాధారణ కథ కూడా అసాధారణ సినిమాగా ఎలా మారుతుంది అనేదానికి “రంగ్ దే” ఒక చక్కని ఉదాహరణ. ప్రొడక్షన్ డిజైన్, డి.ఐ సినిమాకి మెయిన్ ఎస్సెట్స్. సెకండాఫ్ దాదాపుగా ఒకే లొకేషన్ లో సాగినప్పటికీ రిపీటెడ్ గా ఎక్కడా అనిపించదు. అందుకు ఆర్ట్ డిపార్ట్ మెంట్ ను మెచ్చుకోవాలి.

విశ్లేషణ: “రంగ్ దే” కొత్త కథ కాదు, ఊహించలేని కథనం కూడా కాదు. అయితే.. ఎమోషన్స్ అందంగా, హృద్యంగా ఉంటాయి. కామెడీ సీన్స్ ఆకట్టుకుంటాయి. ఎమోషనల్ సీన్స్ సినిమాకి హైలైట్ గా నిలవడమే కాక ఆడియన్స్ ను కనెక్ట్ చేస్తాయి. సో, “చెక్”తో డిజాస్టర్ చవిచూసిన నితిన్ “రంగ్ దే”తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు. ఒకసారి సంతోషంగా కుటుంబంతో కలిసి చూడదగ్గ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఈ చిత్రం.

రేటింగ్: 3/5

Click Here To Read In ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus