విలక్షణ నటుడు రావు రమేష్ సీమ సింహం ద్వారా 2002 లోనే వెండి తెరకు పరిచయం అయినప్పటికీ.. 2008 వరకు కేవలం రెండే రెండు సినిమాలు చేయగలిగారు. రావు గోపాలరావు తనయుడిగా పరిచయం చేసుకున్నప్పటికీ ఛాన్స్ లు ఇచ్చేవారు కరువు అయ్యారు. 2008 లో వచ్చిన గమ్యం, కొత్త బంగారులోకం సినిమాలు రావు రమేష్ కి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు వెనక్కి చూసు కోలేదు. చేతినిండా సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ పదేళ్లలో 100 సినిమాల మార్క్ ని చేరుకొని రికార్డ్ సృష్టించారు. రీసెంట్ గా అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారి ఆలయాన్ని దర్శించుకున్న రావు రమేష్ మీడియాతో మాట్లాడుతూ అనేక ఆసక్తికర విషయాలు చెప్పారు.
“కళామతల్లి సేవలో తరించడం నా అదృష్టం. మొన్న మొన్నే ఇండస్ట్రీలోకి వచ్చినట్లుంది. అప్పుడే 100 సినిమాలు దాటిపోయాయి. వంద సినిమాలలో నటించినా… నేను ఇప్పటికీ నిత్య విద్యార్థినిని. నన్ను ప్రేక్షకులు ఆదరిస్తున్నంతకాలం ఇండస్ట్రీలో ఉంటాను” అని తెలిపారు. అలాగే తన తండ్రి రావు గోపాలరావు గురించి మాట్లాడుతూ.. ” తెలుగు సినీ చరిత్రలో నాన్న రావు గోపాలరావు ఓ చరిత్ర… ఓ నిఘంటువు. సినిమా తెర ఉన్నంత కాలం రావు గోపాలరావు పేరు ఉంటుంది” అని అన్నారు.