బిగ్ బాస్ 2 షో పై మానవ హక్కుల కమిషన్‌ను కలిసిన న్యాయవాది

  • August 24, 2018 / 10:31 AM IST

స్టార్ మా ఛానల్ వాళ్లు ప్రసారం చేస్తున్న అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 2 విజయవంతంగా సాగుతోంది. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో 74 రోజులకు చేరింది. మరి పాతిక రోజుల్లో విజేత ఎవరో తెలిసిపోనుంది. ఇంకొంచెం మసాలా.. అనే ట్యాగ్ తో మొదలైన బిగ్ బాస్ సీజన్ 2 షో లో రొమాన్స్, గొడవలు.. కన్నీళ్లు.. ఇలా అన్ని ఎమోషన్స్ తెలుగు టీవీ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. అయితే ఈ షో వల్ల వినోదం కంటే వివాదమే ఎక్కువగా ఉందని, విజ్ఞానం అసలు లేదని కొంతమంది ఆరోపిస్తున్నారు. మరికొంతమంది అయితే ఈ షో చూడకుండా ఉండాలని ఇళ్లల్లో ఆజ్ఞలను జారీచేశారు. తాజాగా ఓ న్యాయవాది ఈ షో ని నిలిపివేయాలని కోరారు. మానవ హక్కుల కమిషన్ ని ఆశ్రయించారు. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

వివరాల్లోకి వెళితే.. బిగ్‌బాస్ ప్రోగ్రాం పేరుతో ఒకే ఇంటిలో 16 మందిని నిర్బంధించి.. సమాజానికి ఉపయోగపడని, అనవసరమైన వికృత చేష్టలను ప్రసారాలు చేస్తున్నారని హైదరాబాద్ నగరానికి చెందిన హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ ఆరోపిస్తున్నారు. ఈ షోతో ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తూ, కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యువతను చెడు మార్గాల వైపు నడిపిస్తున్న ఈ షోను వెంటనే నిలిపివేయాలని ఆయన మానవ హక్కుల కమిషన్ ని కోరారు. అంతేకాదు.. గృహ నిర్బంధంలో ఉన్న ఆ 11 మంది సభ్యులతో పాటు ప్రజలను కాపాడాలని విన్నవంచారు. ఈ వ్యవహారంపై మానవ హక్కుల కమిషన్‌ ఎలా స్పందిస్తుంది? అనే దానిపై ఆసక్తి నెలకొంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus