రాషా తడానీ.. ఈ బాలీవుడ్ భామ టాలీవుడ్ ఎంట్రీ ఉంటుంది అంటూ గత కొన్ని నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. నిజానికి ఓ స్టార్ హీరో సరసన ఆమె తొలి సినిమా చేస్తోందని, టాక్స్ కూడా అయిపోయాయని కూడా చెప్పారు. కానీ ఆమె కాకుండా మరో హీరోయిన్‌ని తీసుకున్నారు. అమె అందం గురించి, సోషల్ మీడియాలో ఆరబోత గురించి తెలిసిన వాళ్లు ‘ఛ.. ఆమె అయితే బాగుండు’ అని అనుకున్నారు కూడా. అయితే ఇప్పుడు రాషా తొలి సినిమా అనౌన్స్ అయింది. అయితే ఈసారి డెబ్యూ హీరో సినిమాతో.
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ హీరోగా ఓ సినిమా కొన్ని నెలల క్రితం లీక్ ద్వారా బయటకు వచ్చింది. ఆ సినిమాను ఇటీవల అఫీషియల్ చేశాడు. అజయ్ భూపతి తెరకెక్కించనున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా రాషా తడానీ తీసుకున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇందులో పెద్దగా ఆశ్చర్యపోయేదేమీ లేదు కానీ.. అప్పుడు ఆ స్టార్ హీరో సినిమాను ఆమె ఎందుకు వద్దు అనుకుంది అనేదే ఇక్కడ పాయింట్‌గా మారింది. ఆ స్టార్ హీరో రామ్‌చరణ్ అని మీకు తెలిసే ఉంటుంది.
‘పెద్ది’ సినిమా చర్చలు పెద్ద ఎత్తున జరుగుతున్న రోజులవి. హీరోయిన్‌గా ఎవరు అనే ప్రశ్నకు చాలా సమాధానాలు వినిపిస్తున్న రోజులవి. అప్పుడు రాషా తడానీని దర్శకుడు బుచ్చిబాబు కలిశారు అనే వార్త ఒకటి బయటకు వచ్చింది. కథ లైన్ చెప్పారని కూడా లీక్ వచ్చింది. కానీ ఆఖరికి ఆ ప్లేస్‌లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ వచ్చింది. ఆమె రాక పట్ల రామ్‌చరణ్ ఫ్యాన్స్ హ్యాపీనే అయినా.. రాషా అయి ఉంటే బాగుండేది కొత్త అందం టాలీవుడ్‌కి వచ్చినట్లు అయ్యేది అనుకున్నారు.
అలా మెగా కాంపౌండ్ సినిమాతో టాలీవుడ్‌కి వచ్చే ఛాన్స్ మిస్ చేసుకున్న రాషా, ఇప్పుడు మహేష్‌బాబు కాంపౌండ్ సినిమాతో అడుగుపెట్టింది. ఈ సినిమాను వైజయంతీ మూవీస్ అశ్వనీదత్ సమర్పకులు కావడం గమనార్హం.