‘హిట్ కొట్టినం’ అని ఆ స్టార్ హీరోయిన్ ట్వీట్ చేస్తే.. అవును ‘మనం హిట్ కొట్టినం’ అని ఆ సినిమా హీరో రిప్లై ఇచ్చాడు. ఆ ఇద్దరి విషయంలో ఇలాంటి పోస్టులు, రిప్లైలు మనకు కొత్తేమీ కాదు. అయితే ఆ పోస్టు పెట్టిన హీరోయిన్ సినిమా చూస్తే రాసిందా? లేక అందరూ అంటే రాసిందా అనే డౌట్ వచ్చింది కొంతమంది నెటిజన్లకు. క్లోజ్ ఫ్రెండ్ సినిమా చూడకుండా ఇలా రివ్యూ ఇస్తుందా? అని కొందరు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. వాళ్లు చెప్పింది నిజమే ఆ హీరోయిన్ సినిమా చూసింది అది కూడా క్యూబ్‌లో వేసుకొని ఇంట్లో కాదు.. బయటకు వచ్చి ప్రెస్టీజియస్ సింగిల్ స్క్రీన్‌లో చూసిందట.
తెలుగు సినిమాను బాగా ఫాలో అయ్యే వారికి ఆ సినిమా ‘కింగ్డమ్’ అని, ఆ హీరో విజయ్ దేవరకొండ అని, ఆ హీరోయిన్ రష్మిక మందన అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఇదే చర్చ. ఈ సినిమా ప్రెస్ మీట్‌లో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ రష్మిక సినిమా ఎక్కడ చూసింది అనే విషయాన్ని చెప్పుకొచ్చారు. దీంతో ‘అవునా మేం కూడా ఆ రోజు థియేటర్‌కి వెళ్లామే కనిపించలేదు.. బాగా మేనేజ్ చేసింది ఆమె టీమ్’ అని అనుకుంటున్నారు కూకట్‌పల్లి ప్రాంత వాసులు.
ఎందుకంటే విజయ్ దేవరకొండ కొత్త సినిమా ‘కింగ్డమ్’ని ఆయన క్లోజ్ ఫ్రెండ్ రష్మిక మందన భ్రమరాంబ మల్లికార్జునకు వెళ్లి చూసిందట. తొలుత ఆమె శ్రీరాములు థియేటర్‌లో సినిమా చూడాలి అనుకున్నారట. కానీ రష్మిక వస్తే పబ్లిక్‌తో ఇబ్బంది అవుతుందని అనుమతి రాలేదట. దీంతో గెటప్ మార్చుకుని, ఇంచుమించు మారువేషం వేసుకొని భ్రమరాంబ మల్లికార్జున థియేటర్‌కు వెళ్లి సినిమా చూసిందట. ఈ విషయాన్ని నిర్మాత నాగవంశీ ఇంటర్వూలో వెల్లడించారు. ఇక సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయని చిత్రబృందం చెబుతోంది.