రత్నప్రభ… అభివృద్ధి సిరాచుక్క

రత్నం కాంతులీనుతుంది. సానబట్టే కొద్దీ మెరుపు ఇనుమడిస్తుంది. బంగారంలో పొదిగితే ఆభరణం అమూల్యమవుతుంది. రత్నం వంటి బిడ్డను ఐఏఎస్‌ దిశగా నడిపించాడు ఆమె తండ్రి. ఐఏఎస్‌ మకుటానికే కలికితురాయిగా మారిందామె. జాతి నిర్మాణంలో తనదైన ముద్ర వేసింది. జాతి గర్వించే ప్రభావవంతమైన రత్నంగా మారింది.

సినిమా తెర మీద దృశ్యం కనిపిస్తుంది… దర్శకులు కనిపించరు. అలాగే రత్నప్రభ కనిపించరు. ఆమె రూపకల్పన చేసిన పథకాలు సమాజాన్ని నడిపించాయి, నడిపిస్తున్నాయి. దేశంలో సామాన్యుని జీవితాన్ని అందమైన దృశ్యంగా మలచడం వెనుక ఉన్న స్క్రిప్టు ఆమె చేతిలో రూపుదిద్దకున్నదే. ఉదాహరణలు చెప్పుకోవాలంటే ఒకటి కాదు రెండు కాదు కోకొల్లలు.

ఆడబిడ్డ ప్రాణాలకు కాపాడాలి… ఆడబిడ్డను చదివించాలి… అనే ఆకాంక్షకు రూపం ‘బేటీ బచావో… బేటీ పఢావో’
ఆడబిడ్డను లైంగిక వేధింపులు అక్రమ రవాణా బారి నుంచి కాపాడడానికి ఒక ‘ఉజ్వల’
పారిశ్రామికంగా ఎదుగుతున్న మహిళల విజయగాథలకు వేదికగా ‘షీ ఫర్‌ హర్‌’
అబ్దుల్‌ కలామ్‌ స్ఫూర్తితో ‘థింక్‌ బిగ్‌’ అంటూ ఆసియా మహిళా పారిశ్రామిక వేత్తల సదస్సు
పారిశ్రామిక పెట్టుబడులతో కర్నాటకను మొదటి స్థానంలో నిలిపిన ‘ఇన్వెస్ట్‌ కర్నాటక 2016’
ఉత్తరాదిన సూరత్‌ కేంద్రంగా సాగుతున్న వజ్రాల పరిశ్రమను దక్షిణాదికి తెచ్చిన ఘనత
వేళాపాళాలేని ఐటీ రంగం ఉద్యోగినుల కోసం భద్రత, రవాణా సౌకర్యాల సాధన
బాధిత, పీడిత మహిళలను కడుపులో పెట్టుకుని కాపాడడానికి కన్నతల్లి వంటి షెల్టర్‌ హోమ్‌ ‘స్వాధర్‌’
కాఫీ తోటల్లో కూలికి వెళ్లే అట్టడుగు మహిళలకు కాఫీ తోటల పెంపకం హక్కుల కల్పన
ఒక్క సంతకంతో సమాజంలో వందల ఏళ్లుగా కరడుగట్టుకుని ఉన్న దేవదాసీ దుర్నీతికి అడ్డుకట్ట
… ఇలాంటి ఎన్నో నిర్ణయాలు… మరెన్నో కార్యాచరణలు… 39 ఏళ్ల ఉద్యోగయానంలో మైలురాళ్లు.
ఒక అక్షరాస్యత ఉద్యమం, బీసీ మహిళలకు ఇళ్ల నిర్మాణం, ఆటో రిక్షా నడుపుకుని ఉపాధి పొందే అవకాశం…
ఇలా సమాజాభివృద్ధి స్టీరింగ్‌ని మహిళల చేతిలో పెట్టారు రత్నప్రభ.

మనసుతో పాలన…కలెక్టర్‌ హోదాలో ఒక నిర్ణయం తీసుకుంటే అది అమలయ్యి తీరుతుంది. సమస్య నివారణ అవుతుంది. అయితే ఆ సమస్య తిరిగి పురుడు పోసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? దేవదాసీ వ్యవస్థ నిర్మూలన నిర్ణయంతో సమస్యకు అడ్డుకట్ట మాత్రమే పడుతుంది. ఆ మహిళలకు సమాజంలో గౌరవం పెరగాలంటే ఏం చేయాలి? వారి కాళ్ల మీద వాళ్లు నిలబడే అవకాశం కల్పించాలి. అప్పుడే సమాజం వారిని వారికి నచ్చినట్లు బతకనిస్తుంది. అలాంటి అవకాశం లేకపోతే సమాజం ఆ మహిళలను తిరిగి దురాచారపు కత్తులబోనులోకి తోసేస్తుంది. అందుకే దేవదాసీ మహిళల పునరావాసం… బాలికల చదువు మీద దృష్టి పెట్టారు రత్నప్రభ. దేవదాసీ దురాచారం చట్రం నుంచి బయటపడిన మహిళల్లో చదువుకున్న వాళ్లకు, ఆ మహిళల పిల్లలకు ఉపాధి మార్గాల కోసం అన్వేషించారు. అంగన్‌వాడీ వర్కర్‌లుగా, ప్రభుత్వ కార్యాలయాల్లో అటెండర్‌లుగా ఉద్యోగం ఇప్పించి వారికి జీవితభద్రత కల్పించారు. పాలనలో మెదడు పెట్టి చేసిన నిర్ణయాలకు మనసు పెట్టి తీసుకున్న నిర్ణయాలకు మధ్య ఉన్న తేడా అది.

శాంతిప్రభ…రత్నప్రభ బాధ్యతలు నిర్వర్తించిన ప్రదేశాలన్నీ అత్యంత సున్నితమైనవి, పూర్తిగా వెనుకబడినవి. ప్రతి చోటా ఆమె తన మార్కును ప్రదర్శించారు. పాలనలో తనదైన పాదముద్రలను వేయగలిగారు. బీదర్‌లో మత ఘర్షణలు ఉద్రిక్తతకు దారి తీసినప్పుడు ఆమె వ్యవహరించిన తీరు కలెక్టర్‌ అంటే ఎలా ఉండాలో తెలియచేస్తుంది. పదిమంది ప్రాణాలు కోల్పోవడం చిన్న విషయం కాదు. ప్రతిదాడులు జరగకుండా నివారించడం కత్తిమీద సాము వంటిదే. అలాంటి సమయంలో రత్నప్రభ గారు శాంతి కమిటీలతో అత్యంత చాకచక్యంగా పరిస్థితిని చక్కదిద్దారు. బీదర్‌తోపాటు గుల్బర్గా, చిక్‌మగుళూరు ప్రజలు ఇప్పటికీ రత్నప్రభను తలుచుకుంటారంటే అందుకు ఆమె పాలనతీరులో ఉన్న మేధోపరమైన సున్నితత్వమే కారణం. కర్నాటక రాష్ట్రం ఆమె గుర్తిస్తూ సత్కరించింది. జాతీయ స్థాయిలో ఆమె గౌరవ పురస్కారాన్ని అందుకున్నారు. ఆమె అవార్డులందుకోవడమే కాదు. తాను విధులు నిర్వర్తించిన రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును కూడా తెచ్చారు. మహిళాభ్యుదయం కోసం ఆమె రూపకల్పన చేసిన విశేషమైన పథకాలకు గాను కర్నాటక రాష్ట్రానికి ‘మోస్ట్‌ సపోర్టివ్‌ స్టేట్‌ ఫర్‌ ఉమెన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌’ అవార్డు వచ్చింది. తనకు సమర్థంగా పని చేయడానికి అవకాశం కల్పించిన రాష్ట్రానికి ఆమె చెల్లించుకున్న ఉద్యోగ దక్షిణ అది.

డ్వాక్రా మహిళల దీపం…మహిళాభ్యుదయం కోసం, మహిళల ఆర్థిక స్వావలంబన కోసం జాతీయ స్థాయిలో అమలవుతున్న డ్వాక్రా పథకానికి వన్నె తెచ్చారు రత్నప్రభ. స్వయం సహాయక బృందాల మహిళల స్వయం స్వావలంబన కోసం అనేక రాష్ట్రాలు నామమాత్రపు పథకాలతో సరిపెడుతుంటే రత్నప్రభ డ్వాక్రా మహిళల గౌరవాన్ని జాతీయస్థాయిలో నిలిపారు. అరకొర ఉపాధి అవకాశాలతో సరిపుచ్చకుండా వారిని పారిశ్రామికవేత్తలను చేయడానికి ప్రయత్నించారామె. ఫర్నిచర్‌ తయారీ రంగం అంటే… దిగువ ఆదాయ వర్గాలకు చెందిన గ్రామీణ మహిళకు కనీసం ఊహకు కూడా అందదు. అలాంటి ఫర్నిచర్‌ పరిశ్రమను డ్వాక్రా మహిళల చేత పెట్టించారు. పౌల్ట్రీ రంగంలో దినసరి కూలీలుగా, నెలవారీ జీతానికి పని చేసే మహిళల చేత కోళ్ల ఫారాలు, కుందేళ్ల పెంపకం వంటి వ్యాపారాలు పెట్టించారు. దుప్పట్ల నేత, హస్తకళాకృతుల తయారీని ప్రోత్సహించి వారి ఆదాయ మార్గాలను పెంచారు. ఒక సమాజం సర్వతోముభాభివృద్ధి సాధించాలంటే… ఆ సమాజంలో మహిళ  ధైర్యంగా జీవించగలిగినప్పుడే అది సాధ్యమవుతుందని రత్నప్రభ విశ్వసించేవారు. ఆ విశ్వాసాన్ని కార్యాచరణ ద్వారా నిజం చేసి చూపించారు. స్థిరాస్తుల కొనుగోళ్లలో రిజిస్ట్రేషన్‌ మహిళల పేరు మీద జరిగితే స్టాంప్‌ డ్యూటీలో ఒక శాతం మినహాయింపు ఇవ్వాలన్న ఆలోచన నభూతో నభవిష్యతి. కుటుంబానికి ఎంత ఆస్థి ఉన్నప్పటికీ మహిళకు ఆ ఆస్థిపై హక్కులేని పితృస్వామ్య సమాజం మనది. ఈ నేపథ్యంలో మగవాళ్లే స్వచ్ఛందంగా తన భార్య లేదా తల్లి పేరుతో ఆస్థులను రిజిస్టర్‌ చేసేటట్లు ప్రోత్సహించే అద్భుతమైన ఆలోచన ఇది. ప్రభుత్వానికి ఒక శాతం స్టాంపు డ్యూటీ నష్టం రావచ్చు, కానీ ఈ నిర్ణయం మహిళలకు పెద్ద వరం. మహిళ ఆత్మవిశ్వాసంతో జీవించడానికి అద్భుతమైన మార్గం.

ఆధునిక జాతి నిర్మాణం…అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం రత్నప్రభ చేసిన మేధోమధనం ఒక ఎత్తయితే అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్‌ను దీటుగా నిలబెట్టడంలో కూడా ఆమె విశేషమైన ప్రతిభను కనబరిచారు. ప్రపంచం ఆధునికత వెంట పరుగులు పెడుతున్న సమయంలో ఆ పరుగులో భారత్‌ను ముందంజలో నిలపడంలోనూ రత్నప్రభ గణనీయమైన సేవలనే అందించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ చైర్‌పర్సన్‌గా ఆమె నిర్ణయాలు జాతి నిర్మాణంలో మార్గదర్శకాలయ్యాయి. మహిళా సాధికారత సాధనతోపాటు పరిశ్రమల స్థాపన, వాణిజ్యం, మౌలిక వసతులు, ఐటీ రంగం, సంక్షేమం అన్నింటిలోనూ రత్నప్రభ తన మార్కు పాలనను అందించారు.

పుట్టిన నేల రుణం…రత్నప్రభ కర్నాటక కేడర్‌ ఐఏఎస్‌ అధికారి. అయితే జాతీయ స్థాయి రిక్రూట్‌మెంట్‌లో భాగంగా తెలుగు రాష్ట్రంలో పని చేసే అవకాశం వచ్చింది. తాను పుట్టిన తెలుగు నేలకు రుణం తీర్చుకున్నారామె. తెలుగు చలనచిత్ర రంగం మద్రాసు కేంద్రంగా అభివృద్ధి చెందింది. తెలుగు చిత్రసీమను హైదరాబాద్‌కు తీసుకురావడంలో విశేషమైన కృషి చేసిన నాయకుడిగా ఎన్టీఆర్‌ని చెప్పుకుంటాం. తెలుగు సెన్సార్‌ బోర్డును మద్రాసు నుంచి హైదరాబాద్‌కు తీసుకు వచ్చిన ఘనత రత్నప్రభగారిది. ప్రజా ప్రతినిధి తీసుకున్న నిర్ణయానికి మీడియా ప్రచారం కల్పిస్తుంది. ఐఏఎస్‌ అధికారి తీసుకున్న నిర్ణయాలు మౌనంగా ఆచరణలోకి వస్తాయి. ఇక్కడ అదే జరిగింది. ఆమె ఉద్యోగ జీవితాన్ని పరిశీలిస్తే ఒక ఐఏఎస్‌ అనుకుంటే సాధించలేనిదంటూ ఏమీ ఉండదనిపించకమానదు. ఇప్పుడు హైదరాబాద్‌లో అత్యాధునికమైన నగరంగా మనం చూస్తున్న సైబర్‌ సిటీ ఆవిష్కరణలో వైఎస్‌ఆర్‌ పేరు చెప్పుకుంటాం. వైఎస్‌ నిర్ణయాన్ని ఆచరణలోకి తీసుకురావడంలోనూ, సైబర్‌ సిటీకి విదేశీ కంపెనీలను తీసుకురావడంలోనూ నైపుణ్యం రత్నప్రభగారిదే.

రెండు చక్రాలు…సమాజాన్ని నడిపించగలిగేది ప్రధానంగా ఇద్దరు. ఒకరు ప్రజాప్రతినిధి, మరొకరకు ఐఏఎస్‌ అధికారి. అధికారం అనే ఇరుసుకు రెండు వైపులా ఉండే చక్రాలివి. ఈ రెండు చక్రాల మీదనే సమాజ పురోభివృద్ధి ఆధారపడి ఉంటుంది. ఒకరి ఆకాంక్షకు మరొకరి కార్యదక్షత తోడయినప్పుడు ఆ సమాజం నిత్యనూతనంగా భాసిల్లుతుంది. ఆకాంక్షలు ఆకాశమం ఎత్తున ఉన్నప్పటికీ ఆచరణ పాతాళంలో ఉంటే ఫలితం ఉండదు. ప్రజాప్రతినిధికి ఆకాంక్ష ఉండి అవగాహన లోపించిన తరుణంలో తన మేధతో ప్రజాప్రతినిధికి దిశానిర్దేశం చేయగలిగిన ఏకైక వ్యక్తి ఐఏఎస్‌ అధికారి. ప్రతినిధి ఆకాంక్షలకు ఐఏఎస్‌ చిత్తశుద్ధి తోడయితే అభివృద్ధి శరవేగంతో పరుగులు తీస్తుంది. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల్ని గుర్తించడంలో ప్రజాప్రతినిధి తొలి అడుగు అయితే, వాటిని సమర్థంగా అమలు చేయడంలో ఐఏఎస్‌ మేధది తుది అడుగు అవుతుంది. అభివృద్ధిని పతాక స్థాయిలో నిలబెట్టడం ఐఏఎస్‌కి మాత్రమే సాధ్యమైన నైపుణ్యం. సమస్య పరిష్కారం కోసం, సమాజాభివృద్ధి కోసం ఒక నమూనాను తయారు చేయగలిగిన నైపుణ్యం ఐఏఎస్‌ అధికారికే ఉంటుంది. ఆ నమూనాను అంతే చిత్తశుద్ధితో అమలు చేయడం కూడా ఐఏఎస్‌ చేతిలోనే ఉంటుంది. అందుకు నిదర్శనం రత్నప్రభ ఐఏఎస్‌.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus