“ఖైధీ”తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కార్తీ కథానాయకుడిగా రూపొందిన తాజా చిత్రం “సుల్తాన్”. సినిమా టీజర్, ఫస్ట్ లుక్ అదే స్థాయి ఇంపాక్ట్ ను రీక్రియేట్ చేశాయి. అందువల్ల సినిమా మీద మంచి అంచనాలు నమోదయ్యాయి. కార్తీ సరసన రష్మిక మందన్న కథానాయికగా నటించిన ఈ చిత్రానికి “రెమో” ఫేమ్ భాగ్యరాజ్ కన్నణ్ దర్శకుడు. మరి ఈ యాక్షన్ డ్రామా ఎలా ఉందో చూద్దాం..!!
కథ: 100 మంది రౌడీల మధ్య పెరిగిన కుర్రాడు సుల్తాన్ (కార్తీ). చిన్నప్పుడే తల్లి మరణించడంతో ఆ రౌడీల మధ్య అల్లారుముద్దుగా పెరుగుతాడు. ఆ రౌడీలను అన్నయ్యలుగా భావిస్తాడు. అయితే.. వైజాగ్ సిటీకి వచ్చిన కొత్త కమిషనర్ మాత్రం సుల్తాన్ గ్యాంగ్ ను ఎన్ కౌంటర్ లో చంపడానికి సిద్ధమవుతుంటాడు. తాను అన్నలుగా భావించే వందమంది రౌడీలను తీసుకొని అమరావతిలోని వెలగపూడి వెళ్ళిపోతాడు సుల్తాన్. అక్కడ అడ్డంకిగా ఉన్న వాళ్ళని చితక్కొట్టి బయటకు పంపి.. అక్కడి పొలాల్ని సాగుచేయడం మొదలెడతాడు సుల్తాన్.
రౌడీలు రైతులుగా మారడానికి ఎన్ని ఇబ్బందులుపడ్డారు? వాళ్ళని కత్తి పట్టనివ్వకుండా చేయడానికి సుల్తాన్ ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు? అసలు వెలగపూడిని ఓ బిజినెస్ మ్యాన్ ఎందుకు పట్టి పీడిస్తున్నాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే “సుల్తాన్”.
నటీనటుల పనితీరు: కార్తికి ఈ తరహా పాత్రలు కొట్టిన పిండి. అయితే,. నటుడిగా కార్తీ మ్యానరిజమ్స్ రెగ్యులర్ అయిపోతున్నాయి. ఆ విషయంలో కార్తీ జాగ్రత్త వహిస్తే బెటర్. అలాగే.. లాక్ డౌన్ వల్ల కార్తీ హెయిర్ స్టైల్లో కంటిన్యూటీ మిస్ అయ్యింది. రష్మిక పల్లెటూరి పడుచుగా అస్సలు సూట్ అవ్వలేదు. ఆమె కాస్ట్యూమ్స్ & బాడీ లాంగ్వేజ్ లో ఎక్కడా పల్లెటూరి అమ్మాయి అనే భావన కలిగించలేకపోయింది. సినిమాలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేకపోయినప్పటికీ.. సినిమాకి గ్లామర్ దిద్దాల్సిన హీరోయిన్ సినిమాకి ఒకరకంగా మైనస్ గా నిలిచిందనే చెప్పాలి.
“పందెం కోడి” ఫేమ్ సింగంపులికి చాలా కాలం తర్వాత మంచి వెయిటేజ్ ఉన్న పాత్ర లభించింది. మిగతా నటులందరూ ఇప్పటివరకూ చాలా సినిమాల్లో రౌడీలుగా కనిపించినవారే. వాళ్ళ పేర్లు తెలీదు కానీ ఎవర్ని చూసినా అతను ఫలానా సినిమాలో ఉన్నాడు కదా అని గుర్తుపట్టేయొచ్చు. వాళ్ళందరూ చక్కని నట ప్రతిభా కనబరిచారు. యాక్షన్ బ్లాక్స్ లో అదరగొట్టడంతోపాటు.. ఎమోషనల్ & కామెడీ సీన్స్ లో బాగా నటించారు.
సాంకేతికవర్గం పనితీరు: ముందుగా సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకోవాలి. నిజానికి సన్నివేశంలో కానీ, కథనంలో కానీ పెద్దగా కనెక్టివిటీ కంటెంట్ ఉండదు. కానీ.. సత్యన్ తనదైన కెమెరా యాంగిల్స్ తో మాస్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేశాడు. సినిమాలో యాక్షన్ బ్లాక్స్ రొటీన్ అయినా కొత్తగా కనిపించాయంటే కారణం సత్యన్ సినిమాటోగ్రఫీనే. యువన్ శంకర్ రాజా నేపధ్య సంగీతం సినిమాకి మరో ఎస్సెట్. తమిళ ఆడియన్స్ అభీష్టానికి కాస్త లౌడ్ గా ఉన్నా.. ఒక రెగ్యులర్ స్టోరీకి మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు యువన్.
దర్శకుడు భాగ్యరాజ్ కన్నణ్ రాసుకున్న కథలో “ఖలేజా, మహర్షి, కిక్ 2” సినిమాలు కనిపిస్తాయి. నిజానికి ఈ మూడు చిత్రాల కలయికే “సుల్తాన్”. సరే కథ, సన్నివేశాలు ఎక్కడో చూసినట్లున్నాయి అని సరిపెట్టుకున్నా.. స్క్రీన్ ప్లే మరీ నత్తనడకలా సాగింది. దర్శకుడి మదిలో చాలా ఆలోచనాలున్నాయి. అయితే.. వాటిని తెరపై ప్రెజంట్ చేయడంలో విఫలమయ్యాడు. అన్నిటికంటే 156 నిమిషాల నిడివి సినిమాకి బిగ్గెస్ట్ మైనస్. ఈ కంటెంట్ కి అంత రన్ టైమ్ అవసరం లేదు. యాక్షన్ బ్లాక్స్ బాగున్నప్పటికీ.. సదరు బ్లాక్స్ కి విజిల్స్ వేయించే ఎమోషన్ మిస్ అయ్యింది. అందువల్ల సినిమాలో ప్రేక్షకుడు లీనమవ్వడు. పోనీ మాస్ ఆడియన్స్ కనీసం ఫైట్స్ అయినా ఎంజాయ్ చేస్తారులే అనుకుంటే వాటి కంపోజింగ్ కూడా ఇప్పటికే చాలా సినిమాల్లో చూసేసినవి కావడంతో ఒక సగటు ప్రేక్షకుడు ఎగ్జైట్ అయ్యే అంశాలు సినిమాలో లేకుండాపోయాయి. సో, దర్శకుడు భాగ్యరాజ్ కథకుడిగా, దర్శకుడిగా విఫలమయ్యాడు.
విశ్లేషణ: కార్తీ సినిమా అంటే ప్రతి ప్రేక్షకుడికి మంచి అంచనాలుంటాయి. తనదైన శైలి స్క్రిప్ట్ సెలక్షన్ తో కార్తీ క్రియేట్ చేసుకున్న ఇమేజ్ అలాంటిది. అయితే.. ఆ ఇమేజ్ కు చాలా దూరంలో ఉండిపోయింది “సుల్తాన్”. రౌడీ ఫార్మింగ్ అనే కాన్సెప్ట్ వినడానికి కొత్తగా ఉన్నా.. చూడడానికి అంత ఆసక్తికరంగా లేదు. దాంతో “సుల్తాన్” అలరించలేకపోయాడు. కార్తీ కూడా బోర్ డమ్ నుంచి కాపాడలేకపోయాడు.
రేటింగ్: 2/5