“ధమాకా, వాల్తేరు వీరయ్య” చిత్రాలతో వరుసగా రెండు వంద కోట్ల విజయాలను అందుకున్న రవితేజ టైటిల్ పాత్రలో నటించగా విడుదలైన తాజా చిత్రం “రావణాసుర”. సుధర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు (ఏప్రిల్ 07) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాన్నాళ్ల తర్వాత రవితేజ మళ్ళీ నెగిటివ్ షేడ్ లో కనిపించిన ఈ చిత్రం ఆడియన్స్ ను ఏమేరకు అలరించింది? రవితేజకు హ్యాట్రిక్ హిట్ అందించిందా? లేదా? అనేది చూద్దాం..!!
కథ: నగరంలో పేరొందిన బిజినెస్ మ్యాన్ అయిన విజయ్ తల్వార్ (సంపత్ రాజ్) పబ్లిక్ గా ఒక మర్డర్ చేస్తాడు. కానీ.. ఆ మర్డర్ కి, తనకి ఏం సంబంధం లేదని, తనను ఎలాగైనా కాపాడమని అతడి కుమార్తె హారిక తల్వార్ (మేఘ ఆకాష్).. నగరంలోని సీనియర్ క్రిమినల్ లాయర్ అయిన కనకమహాలక్షి (ఫారియా అబ్ధుల్లా)ను కోరుతుంది. కనకమహాలక్షి దగ్గర జూనియర్ గా వర్క్ చేస్తున్న రవీంద్ర (రవితేజ) ఆ కేస్ ను టేకప్ చేస్తాడు.
ఇదే కేస్ ను డీల్ చేస్తున్న అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు (జయరాం) కేస్ ను కాస్త డీప్ గా ఇన్వెస్టిగేట్ చేయగా.. కొన్ని నమ్మలేని నిజాలు తెలుస్తాయి. ఏమిటా నిజాలు? రవీంద్రకు ఈ హత్యలకు ఉన్న సంబంధం ఏమిటి? అనేది “రావణాసుర”(Ravanasura) కథాంశం.
నటీనటుల పనితీరు: రవితేజ ఏ తరహా పాత్రనైనా అద్భుతంగా పండిస్తాడు అనేది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేని విషయం. రావణాసురలో నెగిటివ్ రోల్ లో ఎవరూ ఊహించని విధంగా రెచ్చిపోయాడు రవితేజ. ఈ తరహాలో రవితేజను చూడని ప్రేక్షకులు అవాక్కైన సందర్భాలు బోలెడున్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ నిజంగానే షాక్ ఇచ్చాడు రవితేజ. అయితే.. సెకండాఫ్ లో క్యారెక్టర్ గ్రాఫ్ ను సరిగా బిల్డ్ చేయకపోవడంతో, అప్పటివరకూ ఇచ్చిన బిల్డప్ అంతా నీరుగారిపోయింది. అయినప్పటికీ.. రవితేజను కాస్త మూస నుంచి బయటకు తీసుకొచ్చిన సినిమా ఇదే అని చెప్పొచ్చు.
ఫారియా, మేఘా ఆకాష్, సుశాంత్ ల పాత్రలు కథా గమనానికి తోడ్పడ్డాయి. ఇద్దరి స్క్రీన్ ప్రెజన్స్ కూడా బాగుంది. అను ఇమ్మాన్యూల్. దక్ష నాగార్కర్, పూజిత పొన్నాడ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మిగిలిపోయారు. మలయాళ నటుడు జయరాంకు చక్కని పాత్ర లభించింది. హైపర్ ఆది కామెడీ అంతగా వర్కవుటవ్వలేదు.
సాంకేతిక వర్గం పనితీరు: కథా రచయిత శ్రీకాంత్ విస్సా బెంగాలీ చిత్రం “విన్సి డా” నుంచి మూలకథను తీసుకున్న విధానం బాగున్నా.. సెకండాఫ్ లో కథను నడిపిన విధానం ఆకట్టుకోలేకపోయింది. అలాగే.. సుధీర్ వర్మ మార్క్ టేకింగ్ కూడా సినిమాలో మిస్ అయ్యింది. సినిమాటోగ్రఫీ వర్క్ సోసోగా ఉండగా.. ప్రొడక్షన్ డిజైన్ మాత్రం బాగుంది. సీజీ వర్క్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండేది.
ఒక కథకు చిక్కుముడులు ఎంత ఓపిగ్గా వేశారో.. అంతే ఓపిగ్గా, చాకచక్యంగా తీయాలి కూడా. లేదంటే అప్పటివరకూ ఇచ్చిన బిల్డప్ అంతా వేస్ట్ అయిపోతుంది. రవితేజ ఫ్లాష్ బ్యాక్ మొత్తం జయరాం పాత్రతో తెలుగు నాండీటెయిల్డ్ లెసన్ చదివించినట్లుగా టపటపా చదివించేయడం సినిమాకి మెయిన్ మైనస్ అయిపోయింది. అలాగే.. చివరి 20 నిమిషాల కంగారు ముగింపు కూడా సింక్ అవ్వలేదు.
విశ్లేషణ: రవితేజ చేసిన ఈ ప్రయోగం నటుడిగా ఆయన సత్తాను ఘనంగా చాటినప్పటికీ.. బాక్సాఫీస్ దగ్గర ఈ సగం ఉడికిన కథ వర్కవ్వడం కాస్త కష్టమే. మరి 24 కోట్ల బ్రేకీవెన్ సాధించిన ఈ చిత్రం రవితేజకు హ్యాట్రిక్ కట్టబెట్టడం కాస్త కష్టమే.
రేటింగ్: 2.5/5