ఒక్కోసారి అదృష్టం వద్దనుకున్నా దరిద్రంలా పట్టుకుంటుంది. రవితేజ విషయంలో ఇప్పుడు అదే జరిగింది. ఇది కేవలం “క్రాక్” హిట్ విషయంలో మాత్రమే కాదు. మాస్ మహారాజా అదృష్టం బాగుండి ఈ సంక్రాంతికి విడుదలైన ఒక డిజాస్టర్ నుంచి తప్పించుకున్నాడు. ఆ డిజాస్టర్ మరేదో కాదు “అల్లుడు అదుర్స్”. బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 14న విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడమే కాక కమర్షియల్ గాను అట్టర్ ఫ్లాప్ గా నిలిచే దిశగా సాగుతొంది.
అయితే.. తొలుత ఈ కథను రవితేజ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో తీయడానికి సన్నాహాలు జరిగాయట. ఒక ఆరు నెలలపాటు ప్రీప్రొడక్షన్ వర్క్ జరిగాక రవితేజకు నచ్చకో లేక మైత్రీ సంస్థకు నచ్చకో ప్రాజెక్ట్ ను ఆపేశారట. ఆ తర్వాత తెరి రీమేక్ ను రవితేజ హీరోగా తీయడానికి ప్రయత్నించినప్పటికీ సంతోష్ హ్యాండిల్ చేయలేకపోయాడని వదిలేశారు. దాంతో ఆ కథ బెల్లంకొండ దగ్గరకి రావడం కామెడీ, ఫైట్లు చాలు కథ ఎందుకు అని బాబు పెద్దగా ఏమీ పట్టించుకోకపోవడంతో సినిమా ఆడియన్స్ నెత్తి మీద పడింది.
పొరపాటున ఇదే సినిమా రవితేజ చేసి, ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యుంటే ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలవడమే కాక, కెరీర్ కి ఒక మాయని మచ్చలా మిగిలిపోయేది. ఈ అదృష్టం రవితేజ తదుపరి చిత్రం “ఖిలాడీ” వరకు కూడా కొనసాగితే బాగుండు.