వారం క్రితం రవితేజ సోదరుడు భరత్ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అయితే.. భరత్ చివరి చూపునకు కూడా రవితేజ గానీ, భరత్ తల్లిదండ్రులుగానీ వెళ్లలేదు. భరత్ బాబాయ్, తమ్ముడు రఘు ఆధ్వర్యంలో బయటి వ్యక్తితో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. దీనిపై రవితేజను నెటిజన్లు ఆడిపోసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా రవితేజ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో తన బాధను, భరత్ చనిపోయినప్పుడు వారి కుటుంబ పరిస్థితిని వివరించారు. తమ్ముడు పోయిన బాధలో తాముంటే.. అంత రాద్ధాంతం చేయడం ఎందుకని ప్రశ్నించారు. ”మా బాధ కొన్ని రోజుల్లో తీరేది కాదు. మనకు తెలిసిన వారు చనిపోయారంటేనే ఎంతగానో బాధపడిపోతాం. అలాంటిది కలిసి పెరిగి, కలిసి ఉన్న సొంత తమ్ముడు పోతే నాకెలా ఉంటుంది.
భరత్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని తెలియగానే ఇంటిల్లిపాది షాకయ్యాం. మా నాన్న వయసు 85 ఏళ్లు. భరత్ మరణ వార్త వినగానే ఆయన కుదేలైపోయారు. మా అమ్మ రాజ్యలక్ష్మి ఉన్నచోటే కుప్పకూలిపోయారు. తమ్ముడు రఘును ఆస్పత్రికి పంపించాం. భరత్ ముఖమంతా గాయాలై ఛిద్రమైందని తెలియడంతో.. చూడలేకనే మేము వెళ్లలేకపోయాం. మేమెంత బాధలో ఉండి ఉంటామో అర్థం చేసుకోండి. అంతిమ కార్యక్రమాలను బయటి వ్యక్తులతో చేయించే ఖర్మ మాకేంటి? అమ్మానాన్నల పరిస్థితిని చూసి వారి దగ్గరే నేనుండిపోయా. రఘు చేత అంత్యక్రియలు చేయించొద్దన్నారు. అందుకే మా బాబాయ్‌తో అంత్యక్రియలు చేయించాం. ఆయన ఎవరన్నది జనాలకు తెలియదు. కానీ, భరత్‌ను అనాథలా పంపించేశామంటూ, 1500 ఇచ్చి అంత్యక్రియలు చేయించామంటూ మమ్మల్ని ఆవేదనకు గురిచేశారు. అలా అని వదిలేసినా.. చనిపోయిన వారి గురించి కామెంట్ చేసేటప్పుడైనా కొంచెం ఆలోచిస్తే బాగుండేది. నిజంగా మరీ, ఇంత అమానుషంగా ఉంటారా..? హిట్ల కోసం సోషల్ మీడియాలో మరీ అంత రాద్ధాంతం చేస్తారా..?” అని రవితేజ తన ఆవేదనను వ్యక్తపరిచారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.