మాస్ మహారాజా రవితేజ 2018 లో చేసిన ‘టచ్ చేసి చూడు’ ‘నేల టికెట్’ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రాలతో మూడు డిజాస్టర్లు మూటకట్టుకున్నాడు. ఈ మూడు చిత్రాలు కూడా 10 కోట్ల లోపే వసూళ్ళు ఆగిపోవడం గమనార్హం. ఒకప్పుడు రవితేజ సినిమా అంటే మినిమం గ్యారంటీ అనే ముద్ర ఉండేది అనడంలో సందేహం లేదు. సినిమాకు ఎంత ప్లాప్ టాక్ వచ్చినా చాలా వరకు వసూళ్ళు రాబట్టేవి. ‘ఆంజనేయులు’ ‘డాన్ శీను’ వంటి చిత్రాలకి ప్లాప్ టాక్ వచ్చినా కలెక్షన్లు బ్రేక్ ఈవెన్ సాధించాయి. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రొటీన్ యాక్టింగ్, రొటీన్ స్టోరీలు అంటూ రవితేజ సినిమాలకు జనాలు మొహం చాటేస్తున్నారు. అందులోనూ కథల పెద్దగా ఆసక్తి చూపకుండా కేవలం రెమ్యూనరేషన్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తున్నాడంటూ ఆ మధ్య ఫిలింనగర్లో గుసగుసలు వినిపించాయి. నాని – సాయి పల్లవి కాంబినేషన్లో వచ్చిన ‘ఎం.సి.ఏ’ చిత్రం కూడా రవితేజ చేయాల్సిన సినిమానే అంట. అయితే రెమ్యూనరేషన్ తక్కువ చెప్పడంతో రవితేజ ఆ చిత్రం నుండీ తప్పుకున్నట్టు అప్పట్లో టాక్ నడిచింది.
అయితే వరుస ప్లాపులు పడటంతో రవితేజ రెమ్యూనరేషన్ విషయంలో కాంప్రమైజ్ అయ్యేందుకు రెడీ అయ్యాడని తాజా సమాచారం. అప్పట్లో రవితేజ రెమ్యూనరేషన్ విషయంలో ఒక నెంబర్ చెప్తే అది నిర్మాతలు ఇవ్వాల్సిందేనట. రెమ్యూనరేషన్ విషయంలో కాంప్రమైజ్ అయ్యేవాడు కాదట. ప్రస్తుతం రవితేజ – వీఐ ఆనంద్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రాన్ని ఎస్ ఆర్ టీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తుంది. మొదట్లో ఈ చిత్రానికి రవితేజ 10 కోట్ల రెమ్యూనరేషన్ అడిగాడట. కానీ వరస ఫ్లాపులతో తన మార్కెట్ దెబ్బతినడం.. ఓపెనింగ్స్ కూడా తగ్గడంతో రెమ్యూనరేషన్ ను రూ. 5 కోట్లకు తగ్గించుకున్నట్టు సమాచారం. అయితే రవితేజ కూడా ఈసారి ఎలాగైనా సరే హిట్టు కొట్టి ఫామ్లోకి రావడానికి దేనిని లెక్కచేయకుండా ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నట్టు ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.