తెలుగు సినిమా తెర మీద మళ్లీ సీమ సినిమాల సందడి మొదలవ్వబోతోందా? కొత్త సినిమా కథలు అంటూ చర్చల్లోకి వస్తోన్న సినిమాల కథలు వింటుంటే అదే అనిపిస్తోంది. రామ్- లింగుస్వామి రాయలసీమ బ్యాక్‌డ్రాప్ స్టోరీనే ఎంచుకున్నారు. బాలకృష్ణ – గోపీచంద్ మలినేని సినిమా అటుఇటుగా ఇలానే ఉంటుందంటున్నారు. తాజాగా రవితేజ సినిమా పాయింట్ కూడా సీమనేనట. రవితేజ ప్రస్తుతం ‘ఖిలాడీ’ సినిమా పనుల్లో ఉన్నాడు. కరోనా సెకండ్ వేవ్ రాకపోయుంటే ఈ పాటికి సినిమా అయిపోయి, రిలీజ్ అయిపోయేది.
ఈ సినిమా తర్వాత రవితేజ శరత్ మండవ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన సెట్స్ పనులు హైదరాబాద్ నగర శివార్లలో జరుగుతున్నాయి. అక్కడ 90ల కాలం నాటి రాయలసీమలోని పల్లెవాతారవణాన్ని తలపించేలా సెట్ వేస్తున్నారట. ఈసినిమాలో రవితేజ 90ల కాలం నాటి వ్యక్తిగా కనిపించబోతున్నాడన్నమాట. వింటేజ్ లుక్‌లో రవితేజను చూపించడానికి శరత్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అంతేకాదు ఈ సినిమాలో రవితేజ రాయలసీమ యాసలో మాట్లాడతాడట.
త్వరలోనే ఆ సెట్స్‌లో చిత్రీకరణ ప్రారంభించి వచ్చే ఏడాది తొలి నెలల్లో సినిమా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. రవితేజను మూస ధోరణిలా కాకుండా కొత్తగా చూపించే ఈ ప్రయత్నం ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.