యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్యకి మంచి విజయాన్ని ఇచ్చిన సినిమా ప్రేమమ్. మలయాళ సినిమాకు ఇది రీమేక్ అయినా.. దర్శకుడు చందు మొండేటి కొత్తగా చిత్రించి సూపర్ హిట్ చేశారు. ఈ మూవీ చూసిన వారందరూ ఇందులో సమంత ఉంటే ఇంకా బాగుండేది అనుకున్నారంట. నిజ జీవితంలో ప్రేముకులైన చైతు, సమంతలు తెరపైన మరోసారి కనిపించి ఉంటే అభిమానులు బాగా ఎంజాయ్ చేసేవారని సినీ విశ్లేషకులు భావించారు.
ఈ విషయాన్ని డైరక్టర్ చందు ముందు ఉంచితే ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రేమమ్ సినిమాను తీయాలని అనుకున్నప్పుడు నాగచైతన్య, సమంత లవర్స్ అని తనకి తెలియదని చెప్పారు. “సినిమాలోని హీరోయిన్ పాత్రల సెలక్షన్ చైతూ పూర్తిగా నా మీద వదిలేశారు. అందుకే సుమ, సితార, సింధు ఈ మూడు క్యారక్టర్స్ కు అనుపమ పరమేశ్వరన్, శృతి హాసన్, మడోన్నా సెబాస్టియన్ ను తీసుకున్నాం.
ఒక సమయంలో సింధు పాత్రకు సమంతను అనుకున్నా. కానీ అప్పటికే శృతి లాంటి స్టార్ హీరోయిన్ ఉంది కాబట్టి సమంత అవసరం లేదు అని నిర్ణయించుకున్నా” అని వివరించారు. నాగచైతన్య, సమంత ప్రేమ గురించి ముందే తెలిసి ఉంటే కచ్చితంగా సింధు పాత్రలో సమంతనే తీసుకునే వాడినని డైరక్టర్ తెలిపారు. అలా జరిగి ఉంటే తమ అభిమాన హీరో పెళ్లిని వెండి తెరపై ముందే అభిమానులు చూసేవారు.