మలయాళంలో సూపర్ హిట్ అయిన మోహన్ లాల్ ‘లూసీఫర్’ చిత్రం.. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీమేక్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఎన్.వి.ప్రసాద్ తో కలిసి రాంచరణ్.. ఈ ప్రాజెక్టుని నిర్మించనున్నాడు. మొదట ఈ రీమేక్ ను ‘సాహో’ దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తాడని చిరు ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. అయితే అనూహ్యంగా సుజీత్ ఈ ప్రాజెక్టు నుండీ తప్పుకున్నాడు.అతని స్థానంలో వినాయక్ వచ్చి చేరాడు. దాంతో సుజీత్ స్క్రిప్ట్ నచ్చకపోవడం వల్లనే అతన్ని చిరు తప్పించారని కొందరు అభిప్రాయపడ్డారు.
అయితే తాజాగా ఈ విషయం పై స్పందించి క్లారిటీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన మాట్లాడుతూ.. ” ‘లూసీఫర్’ రీమేక్ నుండీ సుజీత్‌ని ఎవ్వరూ తప్పించలేదు. అతనే స్వయంగా ఈ ప్రాజెక్ట్ నుండీ తప్పుకున్నాడు. ఇటీవల దర్శకుడు సుజీత్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తరువాత అతను ‘లూసీఫర్’ స్క్రిప్ట్ పై మనసు పెట్టలేకపోతున్నాని చెప్పాడు. అందుకే ఈ ప్రాజెక్ట్ నుండీ తప్పుకుంటానని మమ్మల్ని కలిసి తెలియజేసాడు. మేము కూడా అతని నిర్ణయాన్ని గౌరవించి సరే అన్నాము” అంటూ చిరు చెప్పుకొచ్చారు.
ఇక ‘లూసీఫర్’ తో పాటు ‘వేదాలం’ రీమేక్ లో కూడా మెగాస్టార్ నటించబోతున్నారు. ‘వేదాలం’ రీమేక్ ను మెహర్ రమేష్ డైరెక్ట్ చేయనున్నాడు. ‘ఆచార్య’ పూర్తయిన వెంటనే ‘వేదాలం’ రీమేక్ మొదట సెట్స్ పైకి వెళ్లనుంది. ఆ తరువాతే ‘లూసిఫర్’ రీమేక్ సెట్స్ పైకి వెళ్తుందని తెలుస్తుంది.