వర్మ ఎన్నికల్లో నిలబడితే ఏమవుతుందో చెప్పేశారు

  • May 5, 2022 / 12:42 PM IST

ఈ ప్రపంచంలో రామ్‌గోపాల్‌ వర్మ విమర్శించని అంశమంటూ ఏదీ ఉండదు. తనకు కనిపించే ప్రతి విషయమ్మీదా ఆయన విమర్శలు, కౌంటర్‌లు వేస్తూనే ఉంటారు. అలా అని వాటి గురించి అతనికి అన్ని విషయాలు తెలిసి ఉంటాయి అని అనుకోవడానికి లేదు. పూర్తి అవగాహన లేకుండానే విమర్శలు చేస్తుంటారు. ఈ మాట అయనే గతంలో చాలా సందర్భాల్లో చెప్పారు. ఉదాహరణకు రాజకీయాలు, ప్రభుత్వ ఏర్పాటు, విధి విధానాలు లాంటివి. తాజాగా మరోసారి ఇలాంటి అరకొర అవగాహనతో రాజకీయాలు, ప్రభుత్వం గురించి కామెంట్లు చేశారు వర్మ.

‘నా ఇష్టం’ సినిమా ప్రచారంలో భాగంగా రామ్‌గోపాల్‌ వర్మ బిజీబిజీగా తిరుగుతున్నారు. వివిధ రాష్ట్రాలు, నగరాల్లో ఇప్పటికే ప్రచారం చేసి వర్మ.. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రచారం చేశారు. పనిలో పనిగా అలీ వ్యాఖ్యాతగా చేస్తున్న ఓ షోకి హాజరయ్యారు. సినిమా మెయిన్‌ కాస్టింగ్‌ నైనా గంగూలీ, అప్సర రాణీతో కలసి ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఈ క్రమంలో వర్మను అలీ ఎన్నికల గురించి ప్రస్తావించారు. అప్పుడే ఈ వైరల్‌ కామెంట్స్‌ చేశారు వర్మ.

ఒకవేళ మీరు ఎన్నికల్లో పోటీ చేస్తే ఎన్ని ఓట్లు పడతాయి అని అనుకుంటున్నారు అని అలీ అడిగితే… నాకు ఒక్క ఓటు కూడా రాదు అని చెప్పారు వర్మ. అసలు బుద్ధి ఉన్నవాడు ఎవడూ నాకు ఓటు వేయడు. ఆ తర్వాత సీఎం అయితే ఏం చేస్తారు అనే ప్రశ్నకు… ‘నాకు ఈ ప్రాసెస్‌ గురించి తెలియదు కానీ.. సీఎం అవ్వగానే మొత్తం ఖజానా డబ్బుల్ని తీసుకొని వేరే దేశానికి పారిపోతా’ అని కామెంట్‌ చేశారు వర్మ. దీంతో ఆ కామెంట్స్‌ ఇప్పుడు వైరల్‌గా మారాయి.

ఇక వరుస హిట్‌ సినిమాలు చేసినా.. వర్మ ఇప్పుడు ఎక్కడున్నారు అని అలీ అడిగితే.. ఆ వర్మ చనిపోయాడు అంటూ సెటైరికల్‌ కామెంట్‌ చేశాడు వర్మ. మీకు ఇష్టం వచ్చినట్లు సినిమా చేస్తున్నారా? జనాలు చూస్తున్నారా, చూస్తారా అని అడిగితే.. అది వాళ్ల ఇష్టం, మనం సినిమా చూడండి అని ఎలా చెబుతాం అంటూ తిరిగి ప్రశ్నించారు వర్మ.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus