ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ.. ఈ ఇద్దరూ బుధవారం భేటీ అయ్యారు. అందులో ఏముంది, ఏదో పని ఉండి ఉంటుంది అందుకే కలిశారు అని అనుకోవచ్చు. అయితే వైఎస్‌ఆర్‌సీపీ నుండి వేరే సంకేతాలు బయటికొస్తున్నాయి. దీంతో ‘ఏం జరుగుతోంది’ అంటూ ఓ చర్చ ఇటు టాలీవుడ్‌లో, అటు ఏపీ రాజకీయాల్లో మొదలైంది. మామూలుగా వైఎస్ జగన్‌ను వేరే దర్శకుడు కలిస్తే ఇంత చర్చ జరగదు. వర్మ కాబట్టే ఇదంతా.
జగన్ – వర్మ కలిస్తే అంత విషయం ఏముంది అని కాస్త ఆలోచిస్తే ఆసక్తికర విషయాలు బయటికొస్తాయి. వాటికి జగన్ టీమ్ ఇస్తున్న అన్‌అఫీషియల్ లీక్‌లు యాడ్ చేస్తే ఇంకా ఆసక్తికరంగా మారుతుంది. దానికితోడు జగన్‌ను వర్మ సీక్రెట్‌గా కలవడం ఇక్కడ విశేషం. కొన్ని నెలల క్రితం.. టికెట్ ధరల జగడం నడుస్తున్నప్పుడు జగన్‌ను వర్మ కలిశారు. అప్పుడు బహిరంగంగానే చెప్పి మరీ కలిశారు. ఆ తర్వాత బయటికొచ్చి ఏం జరిగింది అనేది చెప్పారు కూడా. కానీ ఈసారి చెప్పకుండా వచ్చారు, తెలియకుండానే వెళ్లిపోయారు.
ఏమైందా అని ఆరా తీస్తే.. వర్మ నుండి త్వరలో ఓ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ సినిమా వస్తుంది అని అంటున్నారు. రాజకీయ నేపథ్యంలో వర్మ తీయబోయే ఓ సినిమా గురించి వైఎస్ జగన్‌తో చర్చించినట్లు సమాచారం. తాజా రాజకీయ పరిణామలపై అక్కడ చర్చ జరిగినట్టు తెలుస్తోంది. వర్మ మీడియాకు కనిపించకుండా వెళ్లిపోవడం, ఈ మీటింగ్‌పై సీఎం కార్యాలయం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.
గతంలో రాజకీయ నేపథ్యంలో ఆర్జీవీ తీసిన చిత్రాలు వివాదాస్పదమయ్యాయి. మరోసారి రాజకీయ నేపథ్యంలో వర్మ సినిమా తీస్తున్నారని వార్తలు రావడంతో రాజకీయాల్లో ఓ వర్గం గుర్రుగా ఉంది అంటున్నారు. ఏడాదిన్నరలో సాధారణ ఎన్నికలు ఉండటంతో వర్మ తీయబోయే సినిమా రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని రాజకీయ వర్గాల్లో అనుకుంటున్నారు. ఇదే సమయంలో వర్మ తీస్తున్న పొలిటికల్ సినిమాకు ఓ వైఎస్‌ఆర్‌సీపీ నేత ఫండింగ్ ఇస్తున్నారని వార్తలు వస్తుండటం కూడా గమనించాల్సిన అంశం. ఈ నేపథ్యంలో సినిమా ఏ పార్టీకి వ్యతిరేకంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అని గుసగుసలు నడుస్తున్నాయి.