ఒక సినిమా ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని జనాలకి అర్ధమయ్యేలా చేయడం కోసమే టీజర్లు, ట్రైలర్లు లాంటివి క్రియేట్ చేశారు. ఈ టీజర్ & ట్రైలర్ సంస్కృతి మొదలైనప్పట్నుంచి సినిమా బిజినెస్ లో భారీ మార్పులొచ్చాయి. అప్పటివరకూ పూర్తి సినిమా లేదా సగం సినిమా చూపించి సినిమాను అమ్మిన దర్శకనిర్మాతలు కేవలం టీజర్, ట్రైలర్ కారణంగా క్రియేట్ అయిన బజ్ ను బేస్ చేసుకొని బిజినెస్ చేయడం మొదలెట్టారు. అజిత్ తమిళ చిత్రం “వేదాలమ్” అందుకు నిదర్శనం. కేవలం టీజర్ తో వచ్చిన క్రేజ్ తో కనీసం సాంగ్ ప్రోమోస్ కూడా రిలీజ్ చేయకుండా సినిమాని విడుదల చేసి సంచలనం సృష్టించారు.
ఇప్పుడు ఈ టీజర్, ట్రైలర్ క్రేజ్ గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. రాంగోపాల్ వర్మ చాన్నాళ్ల తర్వాత తెలుగులో ఒక అగ్ర కథానాయకుడికి కథ చెప్పి ఒప్పించి ఆ సినిమాని సెట్స్ మీదకు తీసుకొచ్చాడు. అదే “ఆఫీసర్”. ఈ సినిమా మొదలైనప్పుడు “శివ” రేంజ్ లో ఉంటుందని మాట ఇచ్చిన రాంగోపాల్ వర్మ విడుదలైన ఫస్ట్ టీజర్ తోనే మాట నిలబెట్టుకోలేకపోయాడని అర్ధమైంది. ఇక.. నిన్న విడుదలైన రెండో టీజర్ తో సినిమా మీద కాకపోయినా దర్శకుడిగా వర్మ మీద ఉన్న నమ్మకం పూర్తిగా పోయింది జనాలకి. టీజర్ లో కనిపిస్తున్నది నాగార్జున అయినప్పటికీ.. టీజర్ చూసిన తర్వాత జనాలకి థియేటర్ లో సినిమా చూడాలన్న ఆశ కానీ ఉత్సుకత కానీ క్రియేట్ చేయలేకపోయింది. మరి కనీసం త్వరలో విడుదలకానున్న ట్రైలర్ తోనైనా కనీస స్థాయి ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోతే.. థియేటర్లో జనాలు కనిపించడం కష్టమే.